Likkar Panchayati : పెట్టుబడి తక్కువ. కష్టం తక్కువ. పేరు మాత్రం లిక్కర్ వ్యాపారిగా మార్కెట్ లో గొప్పగా ఉంటది. పేరుకు పేరు. పైసలకు పైసలు. వెంట, వెంట లాభాలు. సంబంధిత అధికారులతో పలుకుబడి పుష్కలం. ఇంత భారీగా లాభాలు, పేరు ఉన్న వ్యాపారానికి మార్కెట్ లో పోటీ కూడా ఎక్కువగానే ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇటీవల పల్లె నుంచి ఢిల్లీ దాక ఎగబడుతున్నారు. కొందరు నేరుగా పెట్టుబడి పెడితే, మరికొందరు అంతర్గతంగా నమ్మిన వాళ్ళ పేర్లతో పెట్టుబడి పెట్టి సంపాదించు కుంటున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం అనుమతులతో బార్ షాప్ లు, వైన్ షాప్ లు వెలిశాయి. ఇప్పుడు తెలంగాణాలో బార్ , వైన్ దుకాణాల మధ్య కొత్త పంచాయితీ మొదలైనది. బార్ షాప్ యాజమాన్యాలు అంత ఒక్కటైనారు. అందరు ఏకమై ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. వైన్ షాప్ లకు ప్రస్తుతం ఉన్న పర్మిట్ గదులతో తాము తీవ్రంగా నష్ట పోతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. లాభాల మాటేమో గాని నష్టాలను మూటగట్టుకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు. బార్ షాప్ ల అద్దె, వేతనాలు, నిర్వహణ ఖర్చులు కూడా వెళ్లడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బ్రాందీ షాప్ లకు ఇచ్చిన పర్మిట్ రూమ్ పరిమితులకు మించి ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక్క ఏసీ మినహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు వైన్ షాప్ యజమానులు. బార్ ను మరిపించే రీతిలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి వైన్ షాప్ పక్కనే సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో బార్ షాప్ ల ముఖం కూడా ఎవరు చూడటంలేదని బార్ యజమానులు ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బార్ షాప్ లకు గత ఆరేడు నెలల నుంచి మద్యం ప్రియులు రావడం తగ్గింది. వాటి యజమానులకు ఖర్చులు కూడా వేళ్ళని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బార్ యజమానులు అందరు కలిసి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై బార్ షాప్ యజమానులు ప్రస్తుతం ఆధారపడి ఉన్నారు.