BRS Social Media : తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత బిఆర్ఎస్ అధికారం చేపట్టింది. పదేళ్లు అధికారంలో కొనసాగింది. రాజకీయ ప్రకంపనల నేపథ్యంలో అధికారం కోల్పోయింది. అధికారంలో కొనసాగినన్ని రోజులు సోషల్ మీడియా ప్రభుత్వానికి, పార్టీకి అండగా నిలబడింది. ఇప్పుడు అధికారం లేదు. ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు ఎవరు ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పు కుంటారో సోషల్ మీడియా కార్యకర్తలకు అంతుపట్టడంలేదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ ఉనికి అంతంత
మాత్రమే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అధినేత ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. పార్టీ ఓటమి చెందిన నాటి నుంచి కేవలం పార్లమెంట్ అభ్యర్థుల కోసమే గడప దాటారు.అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు అమావాస్యకు, పౌర్ణమికి కనబడేది. కేసీఆర్ కు ఇప్పుడు అధికారం లేదు. పదేళ్లు అంగరంగ వైభవంగా అధికారం చేపట్టారు. అటువంటి నాయకుడికి ప్రతిపక్ష పాత్ర పోషించడం సాధ్యమయ్యేనా అనే అనుమానాలు సైతం సోషల్ మీడియా కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ సోషల్ మీడియా ప్రభుత్వం పై విరుచుకు పడుతోంది. ఉన్నది లేనట్టు. లేనిది ఉన్నట్టుగా సోషల్ మీడియా షేర్ చేస్తోంది. ప్రభుత్వం సోషల్ మీడియా చీఫ్ పై కేసు నమోదు చేసింది. ఒక్కచీఫ్ మీదనే కాదు , రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోషల్ మీడియా ఇంచార్జ్ లపై కూడా అక్కడక్కడ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒకవైపు పోలీస్ స్టేషన్, మరోవైపు కోర్టుల చుట్టూ తిరగలేక సతమతమవుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. గెలిచిన వారు, ఓటమి పాలైన వారు కేసుల పాలైన వారి గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అధికారంలో ఉంటె ఆర్థికంగా ఇబ్బందులు వచ్చేవి కావు. అధికారం పోవడంతో అప్పుడు వాడుకున్న వారు,
ఇప్పుడు ముఖం చాటేస్తున్నారనే ఆరోపణలు సోషల్ మీడియా వర్గం నుంచి వ్యక్తం అవుతున్నాయి.
బిఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తే, అధికార పార్టీ ఒత్తిడి ఎక్కువ అవుతోంది. పోలీస్ కేసుల పాలవుతున్నాం. ఆర్థికంగా నష్టపోతున్నాం. పార్టీ నాయకులు చెప్పిన దానికి ఊ అందమా… ఉఊ అందమా అనే ఆలోచనలో పడ్డారు పలువురు బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి లు.