యూనియన్ నాయకునికే కరువైన వైద్యం
కార్మికుని వైద్యంలో లోపం ఎక్కడ ?
చికిత్స పొందుతూ కార్మికుడు శ్రీనివాస్ మృతి
శ్రీనివాస్ ఏఐటీయూసీ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ
అసంతృప్తిలో మందమర్రి ఏరియా కార్మికులు
Singareni : తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి స్టోర్ జనరల్ అసిస్టెంట్ కార్మికుడు కొత్తపల్లి శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శ్రీనివాస్ మృతి వెనుక అనేక కారణాలు కార్మిక వర్గాల నుంచి వ్యక్తమవు తున్నాయి. సంఘటన వివరాలను ఏరియా కార్మిక వర్గాలు, స్టోర్ కార్మికులు ఈ విధంగా తెలిపాయి. ….
శ్రీనివాస్ స్టోర్ లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో 15 రోజుల కిందట తేనెటీగలు కుట్టినవి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఒక్కడినే మందమర్రి ఏరియా ఆసుపత్రికి పంపించారు. నిబంధనల మేరకు విధులు నిర్వహించే సమయంలో కార్మికుడిని చికిత్స కోసం ఆసుపత్రికి పంపేటప్పుడు వెంట మరొకరిని తోడుగా పంపాలి. కానీ శ్రీనివాస్ ఒక్కడే ఆసుపత్రికి వెళ్లడం జరిగింది.
ఆసుపత్రిలో చేరిన శ్రీనివాస్ కు వైద్యపరీక్షలు చేయగా అధిక రక్తపోటు నమోదయినది. అక్కడే ఆయనకు వైద్యులు చికిత్స చేస్తుండగానే స్టోర్ నుంచి సంబంధిత అధికారులు విధులకు రమ్మంటూ పిలిచారు. వెంటనే శ్రీనివాస్ వైద్యులకు చెప్పకుండానే స్టోర్ లో విధులకు చేరాడు. విధుల్లో చేరిన శ్రీనివాస్ కు వైద్యుల నుంచి ఫోన్ రావడంతో తిరిగి ఆసుపత్రిలో చేరాడు. అధిక రక్తపోటు అదుపులోకి రాకపోవడంతో శ్రీనివాస్ ను ఉన్నత చికిత్స కోసం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ శుక్రవారం మృతిచెందాడు.
మృతుడు శ్రీనివాస్ సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం మందమర్రి ఏరియా స్టోర్ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి. ఒక కార్మిక నాయకుడి చికిత్స విషయంలో యూనియన్ పట్టించుకోలేదా ? సంబంధిత స్టోర్ అధికారులు పట్టించుకోలేదా ? చికిత్స కు పంపేటప్పుడు అతనికి ఒక సహాయకుణ్ణి నిబంధనల మేరకు ఎందుకు పంపలేదు ? విషయం తెలిసిన వెంటనే చిన్న నాయకుడే అని అశ్రద్ద వహించిందా యూనియన్ ? అధిక రక్తపోటు తో చికిత్స పొందుతున్న కార్మికుడు వెళ్లిపోతుంటే ఆసుపత్రి వర్గాలు పట్టించుకోలేదా ? అదే ఒక అధికారి చికిత్స కు వెళితే వైద్యులు ఇలాగె విధులు నిర్వహిస్తారా ? స్టోర్ అధికారి విధుల్లో ఉండి అనారోగ్యానికి గురై చికిత్సకు వెళితే తోటి అధికారులు విధుల్లో చేరమంటూ ఆదేశిస్తారా ? చికిత్స విషయంలో అధికారులకు ఒక నిబంధన , కార్మికులకు ఒక నిబంధన ఉంటుందా ? అని కార్మిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కార్మికుల చికిత్స ఎలా ఉంటుందో చెప్పడానికి కార్మిక నాయకుడు శ్రీనివాస్ చికిత్సనే ఒక తార్కాణం అంటున్నారు మందమర్రి కార్మికులు ఇంతకూ శ్రీనివాస్ మృతికి ఎవరు కారకులు అంటూ మందమర్రి ఏరియా కార్మిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.