Singareni : తెలంగాణ రాష్ట్రంలో ఎందరికో ఉపాధినిస్తున్న సింగరేణి బొగ్గుగనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయరాదని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ వంద ఏళ్లుగా సింగరేణి గనులు కార్మిక కుటుంబాలతో పాటు ప్రైవేట్ పరంగా ఎందరికో ఉపాధినిస్తున్నాయన్నారు.
సింగరేణి యాజమాన్యం సొంతంగా బొగ్గు ఉత్పత్తి చేపట్టడం వలన తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. సింగరేణి సంస్థ విద్య, వైద్య, విద్యుత్ రంగాలను అభివృద్ధి చేయడం వలన కూడా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి బొగ్గు గనులు వెళితే సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో విస్తరించిన బొగ్గు నిల్వలను ఉత్పత్తి చేయడానికి సింగరేణి సంస్థకే హక్కులు ఉండాలని వారు డిమాండ్ చేశారు.
ఆ విదంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విదంగా రాష్ట్రంలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రానికి చెందిన ఎంపీ కేంద్రంలో బొగ్గు మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను సులభంగా పరిష్కరించడానికి అవకాశం కుడా ఉందన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఏ. ఆనందరావు, జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరావు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎం వి రావు గారు, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ డేగల ప్రవీణ్, బ్రాంచ్ సెక్రటరీ నక్కా సుమన్, ట్రెజరర్. గోదారి మురళి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.