నాయకులు యూనియన్ కార్యాలయానికి రావాల్సిందే
పనిచేయని నాయకులు సంఘానికి అవసరం లేదు
AITUC అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
AITUC : సింగరేణి బొగ్గుగని కార్మికుల సమస్యలు యాజమాన్యంతో చర్చించినప్పుడే అపరిష్కృత సమస్యలు పరిస్కారం అవుతాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా యూనియన్ కార్యాలయంలో ఆయన యూనియన్ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా సీతారామయ్య మాట్లాడుతూ ….
యూనియన్ ను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. యూనియన్ అభివృద్ధి కోసం సమయం కేటాయించని వారు అవసరం లేదన్నారు. కేవలం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం యూనియన్ ను అంటిపెట్టుకునే వారిని గుర్తించి తొలగించడం కూడా జరుగుతుందన్నారు. యూనియన్ సభ్యత్వం మనకు దక్కకుండా కొందరు చేసిన కుట్రలు బెడిసికొట్టాయన్నారు. యూనియన్ నాయకులు విధులకు వెళుతూనే కొంత సమయాన్ని సంఘం అభివృద్ధి కోసం కేటాయించాలని కోరారు.
సంఘం కార్యాలయానికి నాయకులు వచ్చినప్పుడే కార్మికులు కూడా కార్యాలయానికి వస్తారని, అప్పుడే వారి సమస్యలు తెలుసుకొని పరిస్కారం చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అధికారులతో పాటు, సేఫ్టీ మైన్ కమిటీ సమావేశాల్లో చర్చించిన అంశాలను యూనియన్ సమావేశాల్లో సైతం చర్చించినప్పుడే కార్మికుల సమస్యలు తొందరగా పరిస్కారం అవుతాయన్నారు. ఈ సమావేశంలో సమ్మన్న,బాజీ సైదా , కొమురన్న, ప్రసాద్ రెడ్డి తో పాటు ఏరియా నాయకులు, కార్యకర్తలు , వివిధ గనుల డిపార్ట్మెంట్ ఫిట్ కార్యదర్శులు పాల్గొన్నారు.