- మంచిర్యాల జిల్లాలో యూనియన్ X కాంగ్రెస్
- యూనియన్ ఓటమితో ఎమ్మెల్యే అసంతృప్తి
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పట్టుదలతో పనిచేసి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడం జరిగింది.మంచిర్యాల జిల్లాలో కూడా కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి మూడు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలవడానికి కృషిచేశారు.ఈ నేపథ్యంలో అధికారం రావడంతో మాకు ఇక రాష్ట్రంలో తిరుగులేదనే భావనలో పలువురు నాయకులు,కార్యకర్తలు పడిపోయారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.సింగరేణి విస్తరించిన ఒక్క అసెంబ్లీ స్థానం మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.ఆ విజయం రాబోయే సింగరేణి ఎన్నికల్లో కూడా కలిసొస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావించారు.
ఓటమిపాలైన యూనియన్
అసెంబ్లీ ఎన్నికల అనంతరం సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు రావడం జరిగింది.సింగరేణి బెల్లంపల్లి రీజియన్ లో మూడు ఏరియాలు ఉన్నాయి.సింగరేణి ఎన్నికల్లో బెల్లంపల్లి ,మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (INTUC )తుడిచిపెట్టుకుపోయింది.కనీసం ఒక్కస్థానంకు కూడా కార్మికులు పట్టం కట్టకపోవడం శోచనీయం. మూడు ఏరియాల్లోని ఒక ఏరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నఎమ్మెల్యే మాత్రం తన సొంత నియోజకవర్గంలో యూనియన్ ఓటమిపాలు కావడంతో అసంతృప్తికి లోనయ్యారు.ఆర్థికంగా ఎక్కడకూడా తేడారాకుండా అన్ని జాగ్రత్తలు అయన తీసుకున్నప్పటికిని యూనియన్ ఓటమిపాలు కావడం ఆ ఎమ్మెల్యే జీర్ణించుకోలేక పోయాడని పలువురు యూనియన్ నాయకులు తెలిపారు.అప్పటినుంచే ఆ ఎమ్మెల్యే యూనియన్ నాయకులపై అసంతృప్తి ఉన్నాడని తెలిసింది.
అక్కడ వద్దు...
ఎప్పుడైతే సింగరేణి ఎన్నికల్లో యూనియన్ ఓటమిపాలైనదో అప్పటినుంచి యూనియన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెడితే అక్కడికి రానని ఆ ఎమ్మెల్యే ముక్కుసూటిగా చెప్పేసాడు.ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఏరియా నుంచి యూనియన్ ఓటమిపాలు కావడంతో అసంతృప్తి చెందాడు.కాంగ్రెస్ పార్టీకి కార్యాలయం లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలతోపాటు, సింగరేణి ఎన్నికల సమయంలో కూడా యూనియన్ కార్యాలయంలోనే విలేకరుల సమావేశం జరిగింది.ఎప్పుడైతే యూనియన్ ఓటమి పాలైనదో అప్పటినుంచి ఆయన యూనియన్ కార్యాలయంలో అడుగుపెట్టడంలేదని పలువురు యూనియన్ నాయకులు తెలిపారు.యూనియన్ పరాజయం కావడంతో యూనియన్ నాయకులపై ఆ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే అసంతృప్తితో ఉండటంతో కొందరు INTUC కీలక నేతలు కూడా ఎమ్మెల్యే పర్యటన సమయంలో ఆయన వెంట ఉండకపోవడం కొసమెరుపు.