The Post Of Deputy CM : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర సీఎం గా నారా చంద్ర బాబు నాయుడు భాద్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 19న భాద్యతలు చేపట్టనున్నారు. గతంలో డిప్యూటీ సీఎం పదవి అనేది లేదు. ఏపీ సీఎం గా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎం లను ఏర్పాటు చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్ రాష్ట్రంలో తన విధులు నిర్వహిస్తుంటారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రి మండలి కూడ ఉంటుంది. సీఎంను గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను సైతం నియమించి ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇదే విషయం రాజ్యాంగంలో స్పష్టం చేయబడింది. కానీ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం ను నియమించాలనే విషయం ఎక్కడ పొందుపరచలేదు. అందుకనే డిప్యూటీ సీఎం పదవితో పాటు ఒకటి లేదా రెండు మంత్రి పదవులను కూడా కేటాయిస్తారు. డిప్యూటీ సీఎం కు ప్రత్యేక ప్రోటో కాల్ , భద్రత కూడా ఏర్పాటు చేస్తారు.
పరిపాలనలో భాగంగా ముఖ్యమంత్రి పరిశీలించే ఫైళ్లు డిప్యూటీ సీఎం కార్యాలయంపై వెళ్లవు. డిప్యూటీ సీఎం కు కేటాయించిన శాఖల ఫైళ్లను మాత్రమే పరిశీలించడానికి అవకాశం ఉంది. మంత్రి మండలిలో రెండో ప్రాధాన్యత ఉన్న పదవి. అయినప్పటికీ ముఖ్యమంత్రి లేని సమయంలో డిప్యూటీ సీఎం హోదాలో నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. ఒకవేళ తీసుకున్నా అవి చెల్లుబాటు కావు. అధికారిక కార్యక్రమాల్లో మాత్రం కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించడానికి అవకాశం మాత్రం ఉంది.