KTR : రాష్ట్రంలో వరదలతో జనం అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. చెమటోడ్చిన సొమ్మంతా వరద పాలైనది. జనం కన్నీళ్లు తుడిచే నాయకులే కరువైనారు. జరిగిన నష్టాన్ని భరించే స్తోమత ప్రజల్లో ఎక్కడ కూడా కనబడుటలేదు. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించారు. సాధ్యమైనంత మేరకు ఓదార్చుతున్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చకున్నా, ఎంతో కొంత అయితే సహాయాన్ని ప్రకటించారు. కానీ కొందరు ప్రతిపక్ష నేతలు వరదల్లో పర్యటిస్తే తమ ఖద్దరు బట్టలకు ఎక్కడ బురద అంటుతుందని కావచ్చు. గడప దాటి రాకుండా ట్విట్టర్ ద్వారా ప్రజలను పరామర్శిస్తున్నారు. ఓట్ల కోసమైతే బురద, మట్టి అని చూడకుండా ఓటర్లు పొలంలో ఉన్నా బురదలో వెళ్లి ప్రాధేయపడుతారు. అది వాళ్ళ అవసరం. ప్రజల అవసరాలు వచ్చే సరికి మాత్రం ముఖం చాటేస్తున్నారు. ట్విట్టర్ ను వాడేస్తున్నారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ క్యాడర్ కు ఒక పిలుపు ఇచ్చారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పదేళ్లు పరిపాలించిన ఉద్యమ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ మాటలను పట్టించుకున్నట్టు ఎక్కడ కూడా కనబడుత లేదు. వేళ్ళమీద లెక్కించేంత మంది నాయకులే జనంలో అక్కడక్కడ కనబడుతున్నారు. మిగతా నాయకులు పట్టించుకోవడంలేదు. కేటీఆర్ మాటలను ఆయన సన్నిహిత నాయకులు కూడా పట్టించుకోకపోవడంతో పార్టీలో చర్చనీయాంశం అయ్యింది.
వరంగల్ జిల్లాలో సత్యవతి రాథోడ్, ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, గ్రేటర్ లో లక్ష్మారెడ్డి, నల్గొండ జిల్లాలో బొల్లం మల్లయ్య యాదవ్ తో పాటు మరికొందరు మాత్రమే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ విపత్కాల సమయంలో విదేశాల నుంచి కేటీఆర్ పిలుపు ఇచ్చినప్పటికీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ముందుకు రాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.
ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజలు వరదలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రజలను ఆదుకోడానికి సలహాలు, సూచనలు ఇవ్వడం లేదు. పర్యటించి అండగా ఉంటామని చెప్పడానికి కూడా బయటకు కేసీఆర్ రావడం లేదు. కేసీఆర్ తీరుతో కూడా బిఆర్ఎస్ శ్రేణుల్లో అసహనం వ్యక్తం అవుతోంది.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నవి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కూడా బిఆర్ఎస్ శ్రద్ద చూపడంలేదనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రజల్లోకి రాకుండా కేవలం కేటీఆర్, హరీష్ రావ్ పైననే ఆధారపడినట్టు కనిపిస్తోంది. ఆ ఇద్దరిని ప్రజల్లోకి పంపితే పార్టీకి ఫలితం లేదని పలువురు పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు.