Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. రెండోసారి అధికారం తనదే అనే ధీమాలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. జగన్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఏకమై కూటమిగా ఏర్పడ్డారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ప్రయత్నించారు. గొడవలు, అల్లర్లు, దాడులు, విధ్వంసం తో ఎన్నికలు ముగిశాయి. మిగిలింది ఓట్ల లెక్కింపు.
దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఏపీ ప్రజలు పోలింగ్ రోజు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓటర్లు అధికంగా తరలి రావడంతో పోలింగ్ శాతం కూడా 2019 కంటే ఎక్కువగానే నమోదయినది. 83 శాతం నమోదు కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. పెరిగిన పోలింగ్ శాతంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ పరిపాలనపై మంచి అభిప్రాయం ఉండటంతోనే ఎక్కడ ఉన్నా వచ్చి మాకే ఓటువేశారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే కూటమికి అనుకూలంగా ఓటువేశారని కూటమి అభ్యర్థులు ఉత్సహంగా ఉన్నారు.
ఆరోజు మీరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళుతున్నారా.. ? బస్సు టికెట్ రిజర్వేషన్ చేయించారా ? రైల్ టికెట్ రిజర్వేషన్ చేయించారా ? . టికెట్ దొరికిందా ..? దొరకదు . ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను జూన్ నాలుగున లెక్కిస్తున్నారు. ఏపీ కి చెందిన వారంతా దేశంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. తమ అభ్యర్థుల విజయాన్ని కళ్లారా చూడటానికి దేశంలో ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఓట్ల లెక్కింపు రోజు ఏపీ కి తరలి వస్తున్నారు. ఏపీ రావడానికి బస్సు, రైల్ టికెట్ కోసం ఆన్ లైన్ లో రిజర్వేషన్ టికెట్ కోసం వెదికితే సీట్లు లేవని రైల్, ఆర్టీసీ సంస్థలు చెబుతున్నాయి. జూన్ 2 ఆదివారం. జూన్ 3 వరకు టికెట్ లు లేవు.
కొందరు క్యాబ్ లు మాట్లాడుకొని ఏపీ కి వస్తున్నట్టు సమాచారం. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత విజయోత్సవాల అనంతరం వెళ్ళడానికి కూడా టికెట్ లు లేవు. అయినా తమ అభిమాన నాయకుడి విజయాన్ని చూడటానికి ఏపీకి పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం.