KCR : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏది మాట్లాడిన అది ఒక సంచలనం మాట అవుతుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావ్ లను రంగంలోకి దింపారు. కానీ బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వారు చేస్తున్న ప్రచారం ఆయన ఆశించిన మైలేజ్ రాలేదు. అప్పటికే కేసీఆర్ కూతురు లిక్కర్ కేసుపై అరెస్ట్ అయ్యింది. ఒకవైపు పార్టీ అధికారం కోల్పోయింది. కూతురు జైలు పాలు అయ్యింది. బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు అత్తెసరు గా కనబడుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోయే వారు ఎక్కువగా కనబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో తన అభ్యర్థుల గెలుపు కోసం బస్సు యాత్ర చేపట్టారు. అన్ని పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. అధినేత పర్యటనతో జనం స్పందన పెరిగింది.గులాబీ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.
ఎన్నికల పోలింగ్ సమయం సమీపించిన నేపథ్యంలో కేసీఆర్ ఆసక్తికరంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరలు అవుతున్నాయి. అదేవిదంగా రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసాయి. బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు తెలంగాణలో 12 మంది గెలుస్తున్నారని జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ఒక్క సీట్ కూడా రాదంటున్నారు. ఒకటి ఎంఐఎం గెలువగా, మిగతావి కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్ వివరించారు. ప్రైవేట్ సంస్థలు తమ సర్వే ప్రకారం బిఆర్ఎస్ ఒకటి లేదా రెండు, ఎంఐఎం ఒకటి, ఎనిమిది బీజేపీ, ఆరు కాంగ్రెస్ గెలుస్తుందని ప్రకటించడం విశేషం.
తాజాగా కేసీఆర్ మీడియా తో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. అసలు బీజేపీ పార్టీకి నాలుగు వందల సీట్లు రావని, కేవలం రెండువందల సీట్లు రావడం గొప్ప అని అన్నారు. నాలుగు వందల సీట్లు వస్తాయని మోదీ గొప్పగా చెప్పుకోవడం పచ్చి అబద్ధమన్నారు. ఎన్డీయే కూటమి అధికారం కోల్పోవడదం ఖాయమన్నారు. మోదీ విధానాలు నచ్చకనే ప్రజలు బీజేపీ ని దూరం పెడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తో జత కట్టిన పార్టీలు కూడా విజయం సాధించే పరిస్థితి లేదన్నారు. ఇండియా కూటమి కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా దారుణంగా ఓడిపోతున్నదన్నారు. ఈ ఎన్నికలతో కాంగ్రస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయమన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగే అవకాశాలు ఏమాత్రం కనబడటంలేదన్నారు.
దేశంలో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి అధికారం ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. కానీ ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విదంగా పరిస్థితి ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల అభ్యర్థులే గెలవడం ఖాయమని అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వానికే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.
ఈ మాటలు నేను చెబుతున్నది కాదు. సర్వే చేసిన వాళ్ళను నేను అడిగితేనే చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయని అడిగితే ప్రాంతీయ పార్టీలదే హావా ఉంటదని చెప్పారని చెప్పడం విశేషం.
అంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో జతకట్టని పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్పకనే చెప్పారు. ఆ పార్టీలందరిని ఫలితాల సమయం నాటికి ఏకతాటిపైకి తీసుకు రావడం సాధ్యమయ్యేపనేనా అనే అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఆయన మూడో ఫ్రంట్ పేరుతో జెండా ఎగురవేశారు. కానీ అప్పుడు బలమైన ప్రాంతీయ పార్టీలు ఆయన దరి చేరలేదు. వేళ్ళమీద లెక్కపెట్టేనన్ని పార్టీలు మాత్రమే ఆయన ఏర్పాటు చేసిన విందు ఆరగించాయి. ఏది ఏమైనప్పటికీ బీజేపీ కూటమిని కాదని ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో పరిపాలించే పరిస్థితి కనబడుటలేదు. బీజేపీ ని కాదని మరో ఫ్రంట్ తో జతకడితే ఆరోగ్యకరమైన పరిపాలనను అనవసరంగా అనారోగ్యకరమైన వాతావరణంలోకి పోతుంది. అటువంటప్పుడు బీజేపీ ని కాదని కేసీఆర్ ఏర్పాటు చేసే ఫ్రంట్ కోసం ముందుకు రావడం కూడా అనుమానమేనని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు, బీజేపీ శ్రేణులు సైతం కొట్టిపారేస్తున్నారు. అధికారం కోల్పోయిన కేసీఆర్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటున్నారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. అదేవిదంగా మూడోసారి కేంద్రంలో కమలం వికసించడం ఖాయమని కాషాయం శ్రేణులు ప్రకటించడం విశేషం.