Allu Arjun : ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదాస్పదమైనది. వైసీపీ నంద్యాల అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి శనివారం అల్ఫాహారానికి వచ్చారు. అదేరోజు నంద్యాల్లో తెలుగు దేశం అధినేత నారా చంద్రాబునాయుడు తన పర్యటన కోసం ముందస్తు సంబంధిత శాఖల అనుమతి తీసుకున్నారు. ఒకేరోజు ఇద్దరి పర్యటన ఉండటంతో నంద్యాల నియోజకవర్గం లో టీడీపీ, బన్నీ వర్గాల్లో ఉత్కంట ఏర్పడింది. అయితే ముందస్తు అనుమతి లేకుండా అర్జున్ రావడం, ఆ పర్యటనకు పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం విశేషం. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అల్లు అర్జున్ అభిమానులు భారీ ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున వాహనాలు, స్కూటర్ లతో పట్టణంలో పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు.
ప్రదర్శనలో ఎవరెవరు ఎవరికి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారో తెలియక కొందరు నాయకులు గందరగోళానికి గురయ్యారు. కొందరు అల్లు అర్జున్ కు , అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి లకు అనుకూలంగా నినాదాలు చేశారు. మరి కొందరు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా నినాదాలు చేయడం కనిపించింది. చంద్రబాబు నాయుడి పర్యటన కోసం ముందస్తుగా పోలీస్ శాఖ అనుమతి తీసుకున్నామని నంద్యాల తెలుగు దేశం పార్టీ అభ్యర్థి ఫరూక్ వివరించారు. అటువంటప్పుడు అల్లు అర్జున్ పర్యటనకు అనుమతి లేనప్పుడు పోలీసులు ఎలా బందోబస్తు ఏర్పాటు చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా పర్యటన చేపట్టినందుకు హీరో అల్లు అర్జున్ తోపాటు వైసీపీ అభ్యర్థి రవి చంద్ర కిషోర్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్టు ఎన్నికల అధికారి తెలిపారు.
పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయంపై నంద్యాల ఓటర్లలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఒక ప్రముఖ నటుడు వస్తున్న విషయం తెలిసి కూడ ముందుగా ఎందుకు అడ్డుకోలేకపోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదేరోజు చంద్రబాబు పర్యటన ఉందనే విషయం కూడా అధికారికంగా తెలుసు. కానీ అధికార పార్టీ అభ్యర్థి, అందులో నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతోనే పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.