KCR go to Maharastra : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికారంలో కొనసాగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అప్పటి నుంచి గులాబీ శ్రేణులు కండువాను మార్చుకునే సాంప్రదాయానికి తెరలేపారు. ఇంతలో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పార్టీ కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉందని పలు సర్వే సంస్థలు కూడా స్పష్టం చేశాయి.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రావడానికి ముందే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా సవరించారు. కేంద్రంలో చక్రం తిప్పడానికే తాను బిఆర్ఎస్ ను స్థాపించినట్టు కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగు నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. అక్కడి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పోటీచేయడానికి పార్టీని సమాయత్తం చేస్తున్నారు కేసీఆర్. సత్తాచాటే అభ్యర్థుల కోసం అధినేత కేసీఆర్ వేట ప్రారంభించినట్టు తెలుస్తోంది.
బిఆర్ఎస్ ను మహారాష్ట్రలో ప్రారంభించిన నేపథ్యంలో అక్కడి నాయకులు కొందరు కేసీఆర్ సమక్షములో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని చూసిన మహారాష్ట నేతలు వాళ్ళ దారి, వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు అక్కడ పార్టీ జెండా మోసేవారు కరువైనారనే అభిప్రాయాలు సైతం గులాబీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం మరో పార్టీ గూటికి చేరుకోకతప్పలేదు.
ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట అనే సామెతను సభల్లో అనేకసార్లు కేసీఆర్ ప్రజలకు చెప్పారు. ఇప్పుడు ఇదే సామెతను పార్టీ శ్రేణులు గుర్తుకు చేసుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అభ్యర్థులు ఇంటికి పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం అధినేత కేసీఆర్ పయనం కావడం పలువురు శ్రేణులకు నచ్చడంలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఎందుకు పరాజయం పాలైనది అని అక్కడి ప్రజలు అడిగితే ఏమని సమాధానం చెబుతామని కూడా కొందరు సీనియర్ నాయకులు చర్చకు తెరలేపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మహారాష్ట్ర ఎన్నికల్లో పోరుకు సై అంటున్నాడంటే దాని వెనుక ఎదో అంతరంగం దాగి ఉంటుందని కూడా గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు.