BRS Party : తెలంగాణ ఉద్యమానికి పెట్టిందిపేరు కరీంనగర్. మాజీ సీఎం కేసీఆర్ కు కూడా కరీంనగర్ అంటే కలిసొచ్చిన ప్రాంతం. సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ ను కేసీఆర్ కూడ అదృష్టంగా భావిస్తారు. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినా కరీంనగర్ నుంచే ప్రారంభించేది కేసీఆర్. కేసీఆర్ కూడా కరీంనగర్ నుంచే ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరు పోటీ చేసిన అక్కడ విజయం ఖాయం. కేసీఆర్ కు కంచుకోట గా నిలిచిన కరీంనగర్ తాజా పార్లమెంట్ ఎన్నికల్లో మొండి చేయి చూపించింది. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పోటీ చేసి మూడో స్థానం తో సరిపెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు. ఏడు స్థానాల్లో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల లోనే బిఆర్ఎస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. మిగతా ఆరు స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. మొత్తం మీద పార్టీ అభ్యర్థి ఓటమి పాలు కావడంతో పాటు మూడో స్థానంలో నిలిచి పోయారు. కనీసం రెండో స్థానం కూడా రాకపోవడంపై ఆత్మపరిశీలన కూడా మొదలైనది.ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. భవిష్యత్తులో పార్టీ పరిస్థితి పై ఆందోళన వ్యక్తం అవుతోంది.
అసెంబ్లీ ఎన్నికలతో పార్టీ పరాజయాన్ని మూట గట్టుకొంది. అధికారం కోల్పోయింది. పార్టీ శ్రేణులు కొందరు దూరమయ్యారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికల నగారా రాష్ట్రంలో మోగింది. ఈ ఎన్నికల్లో అయినా అభ్యర్థులు విజయం సాధించి పార్టీకి అండగా నిలుస్తారని గులాబీ శ్రేణులు ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి. అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ వచ్చి ప్రచారం చేశారు. అయినా
సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ కంచుకోటలో అభ్యర్థి పరాజయం పాలు కావడం తప్పలేదు.
2019 లో కరీంనగర్ ఎంపీ గా పోటీచేసిన వినోద్ కుమార్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2024 లో తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను అధినేత కేసీఆర్ బరిలో దింపారు. మరోసారి బండి సంజయ్ చేతిలోనే ఓటమి పాలు కావడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు.
పార్లమెంట్ అభ్యర్థి ఓటమి పాలు కావడంతో ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పునరాలోచనలో పడ్డారు. పార్టీ శ్రేణులు చేజారి పోకుండా ఉండేందుకు రాబోయే స్థానికి సంస్థల ఎన్నికలను ఆశగా చూపుతున్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో మనమే సత్తా చాటుతామని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కంచుకోట కరీంనగర్ లో కాకలుదీరిన నాయకులు పార్టీని ఏమేరకు ముందుకు తీసుకు వెలుతారో వేచిచూడాల్సిందే.