Megastar Chiranjeevi : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు జూన్ నాలుగున వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. జనసేన ఏపీ లో 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో తన అభ్యర్థులను పోటీలో నిలిపింది. ఎన్నికల్లో జనసేన పార్టీ విజయపతాకాన్ని ఎగురవేసింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో తన అభ్యర్థులు విజయం సాధించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన అభ్యర్థులను గెలిపించడానికి చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ దాదాపుగా ప్రచారం చేశారు. ఒక్క చిరంజీవి ప్రత్యక్షంగా జనంలో రాకపోయినా సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేశారు. జనసేన పార్టీకి విరాళంగా ఐదు కోట్ల రూపాయలు కూడా చిరంజీవి అందజేసి సహాయ, సహకారం అందించారు. ఇది కూడా సోషల్ మీడియాలో ఒకరకంగా ప్రచారం జరిగింది. సినిమా పరిశ్రమకు చెందిన సాంకేతిక నిపుణులు, కొందరు దర్శకులు, నిర్మాతలు కూడా జనసేన కు జనంలోకి వచ్చి ప్రచారం చేశారు.
చిత్ర పరిశ్రమలో చిరంజీవి , అల్లు అరవింద్ కుటుంబాలు రెండు కూడా ఒకటే అనే అభిప్రాయం ఉంది. అరవింద్ కుటుంబం నుంచి అల్లు అర్జున్ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. జాతీయ స్థాయి అవార్డు సైతం అందుకున్నాడు. ఏపీ లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడికి పరోక్షంగా ప్రచారం చేశారు. కానీ మామ పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం రాజకీయ వర్గాలతో పాటు సినీ పరిశ్రమలో సైతం చర్చకు తెరలేపింది.
మిత్రుడు శిల్ప రవి చంద్ర రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అల్లు అర్జున్ భార్యతో కలిసి అయన ఇంటికి వెళ్లారు. బన్నీకి అక్కడ ఘనంగా స్వాగతం పలికారు. బన్నీ తన అభిమానులకు, వైసీపీ నాయకులకు అభివాదం చేశారు. ఈ సంఘటన కొంతవరకు రెండు కుటుంబాల్లో వివాదానికి దారితీసిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. చిరంజీవి తో పాటు అరవింద్ కూడా ఈ వ్యవహారం పై ఎక్కడ కూడా నోరు జారకుండా ఉండి సద్దుమణిగే విదంగా హుందాగా వ్యవహరించారు.
ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత తోపాటు పార్టీ అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించారు.ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ భార్య, పిల్లలతో సహా వచ్చారు. చిరంజీవి ఇంటిలో చిరంజీవి కుటుంబం మొత్తం ఉన్నారు. కుటుంబ సభ్యులు అందరూ పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికారు. కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. చిరంజీవి ఇంటిలో ఏ కార్యక్రమం జరిగినా అల్లు కుటుంబం అంత వచ్చి చేరుతారు. కానీ పవన్ కళ్యాణ్ కు స్వాగత కార్యక్రమానికి మాత్రం అల్లు అరవింద్ కుటుంబ రాకపోవడంతో చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. అల్లు కుటుంబం నుంచి ఏ ఒక్కరు కూడా రాకపోవడం విశేషం. ఇందుకు కారణం అల్లు అర్జున్ మిత్రుడు రవి చంద్ర రెడ్డి ఇంటికి వెళ్లి అభినందనలు తెలుపడం, మామ కు సోషల్ మీడియాలో తెలపడమేనని రాజకీయ, చిత్ర పరిశ్రమ లో అభిప్రాయపడుతున్నారు.