BRS-MLC : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ లల్లో రాజకీయ ప్రకంపనాలు మొదలైనయి. గులాబీ పార్టీకి ఒకే ఒక్క స్థానం దక్కనుంది. దక్కనున్న ఒక్క స్థానం కోసం చాలా మంది నాయకులు ఆశపడుతున్నారు. కనీసం తక్కువలో తక్కువ ముప్ఫయ్ మంది నాయకులు ఫామ్ హౌజ్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
నలుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు, ఒకరు మజ్లీస్ కు చెందిన ఎమ్మెల్సీ పదవీవిరమణ చేయనున్నారు. ప్రస్తుతం సత్యవతి రాథోడ్ మండలిలో విప్ గా ఉన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి తనకే అవకాశం ఇస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. పదవీవిరమణ చేసేవారితో పాటు దాసోజ్ శ్రవణ్ కూడా తనకే ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే ఆశతో ఉన్నారు.
ప్రస్తుతం పోటీ పడుతున్న వారు 30 మంది వరకు ఉన్నారు. వీరితో పాటు పదవి విరమణ చేసేవారు సైతం పోటీపడుతున్నారు. వీరందరిలో ఒకరిని కాదని, మరొకరికి పదవి ఖరారు చేస్తే పార్టీలో అసంతృప్తి ఏర్పడుతుంది. అందుకనే అధినేత కేసీఆర్ మౌనం వహిస్తున్నారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. ఎవరికీ కోపం రాకుండా ఉండాలంటే సత్యవతి రాథోడ్ ను ఖరారు చేస్తే తలనొప్పి ఉండదనే అభిప్రాయంతో అధినేత ఉన్నట్టు సమాచారం. నామినేషన్ ల సమయానికే కేసీఆర్ తన మనసులో ఉన్న వారి పేరును బయట పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం సైతం పార్టీలో వ్యక్తమవుతోంది.