AP BJP : దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను నియమించబోతోంది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నవి. తెలంగాణ రాష్ట్రానికి ఐదుగురికి పైగా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఏపీ లో కూడా కమలం కుర్చీ కోసం భారీగానే పోటీ కనబడుతోంది. ప్రస్తుతం అధ్యక్షురాలుగా పురందేశ్వరి కొనసాగుతున్నారు. ఆమెను బాధ్యతల నుంచి తప్పించబోతున్నారని రాజకీయ పుకార్లు గుప్పుమన్నాయి.
వాస్తవానికి ఏపీ లో బీజేపీ అధ్యక్షుడు నామ మాత్రమే. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేది అంటూ ఏమి లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ మిత్రపక్షము. పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు చేపట్టాల్సినంత అవసరం లేదు. ఏదన్నా ఉందంటే అధికారంలో ఉన్నామంటే ఇల్లు చక్కపెట్టుకోడానికి మాత్రమే అధ్యక్ష పదవిని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సదుద్దేశ్యంతోనే పదవి కోసం ఆశించే వారి సంఖ్య పెద్దగా ఉంది.
అధ్యక్ష పదవిని భర్తీ చేసిన ప్రతిసారి కమ్మ, లేదంటే కాపు సామజిక వర్గానికే అవకాశం ఇస్తున్నారు. రాయలసీమ రెడ్డి వర్గానికి అవకాశం ఇవ్వాలని కొందరు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల్లో అధ్యక్షుడు ఎవరనేది తేలిపోతుంది. కొత్త వాళ్ళను ఏర్పాటు చేసుకొని తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తే పురందేశ్వరి కొనసాగించే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు ఏపీ రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
అధ్యక్ష పదవి కోసం రెడ్డి సామజిక వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, బీసీ సామజిక వర్గం నుంచి ఆదోని ఎమ్మెల్యే పార్థ సారధి, పీవీఎన్ మాధవ్, కమ్మ సామజిక వర్గం నుంచి సుజనా చౌదరి పోటీ పడుతున్నారు.
పొలిటికల్ బ్యూరో
కొమ్మెర అనిల్ కుమార్, ఎమ్మే, బీఎడ్