Ex CM KCR : కొన్ని సందర్భాల్లో ఆలస్యం అమృతం అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో విషం కూడా అవుతుంది. ఈ సూత్రాన్ని బహుశా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కు వెంట, వెంట ఇబ్బందులు ఎదురైనాయి. పార్టీ అధికారం కోల్పోయింది. ఆ తరువాత ఆయన అనారోగ్యానికి గురికావడం. అంతలోనే కూతురు కవిత అరెస్ట్. వీటన్నిటి నేపథ్యంలో అయన మానసికంగా ఇంటికే పరిమితం అయ్యారు. ఎట్టకేలకు కవిత బెయిల్ పై రావడం జరిగింది. కేసీఆర్ కు కూడా కొంతమేరకు ఉపశమనం కలిగింది.
ఇన్ని రోజుల పాటు పార్టీ గురించి కానీ, పదేళ్ల పరిపాలనపై గాని ఎన్ని విమర్శలు వచ్చినా అయన నోరుమెదపలేదు. ఎవరెన్ని మాటలు మాట్లాడినా హరీష్ రావ్, కేటీఆర్ మాత్రమే ఎదుర్కొన్నారు. పార్టీ విలీనం గురించి ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలు చేసినప్పటికీ కేసీఆర్ నోరుజారలేదు. మౌనంగానే ఇన్ని రోజులు కాలం గడిపారు. కూతురు కవిత బెయిల్ నుంచి రావడంతో అయన మానసికంగా ఎంతో బలోపేతం అయినట్టు కనిపిస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కోడానికి బిఆర్ఎస్ సోషల్ మీడియా వరకు బాగానే ఉంది. హరీష్ రావ్, కేటీఆర్ ఎంత అరిచినా ఆ అరుపులు హైదరాబాద్ కె పరిమితం అవుతున్నాయి. గులాబీ శ్రేణుల పోరాటం అత్తెసరు మాదిరిగానే కనబడుతోంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు మానసికంగా సన్నద్ధమయ్యారు. ప్రభుత్వంపై, ప్రజల సమస్యలపై కేసీఆర్ పోరాటానికి సన్నద్ధమవుతున్నారని పార్టీ ప్రథమ శ్రేణి నాయకుల సమాచారం.
రాష్ట్రంలో తానూ చేపట్టబోయే పర్యటనల గురించి కేసీఆర్ స్వయంగా ప్రకటించబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను చుట్టివచ్చే విదంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్నర్ మీటింగ్ లను కూడా ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని పార్టీ శ్రేణుల తాజా సమాచారం.