Raghunandan rao : బీజేపీ సీనియర్ నాయకుడు, మెదక్ ఎంపీ రఘునందన్ రావ్ కు మరోసారి మావోయిస్టుల నుంచి బెదిరింపులు. ఆసుపత్రి నుంచే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ మావోయిస్టు పార్టీ కమిటీ హత్యకు ఆదేశించినట్లు బెదిరించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఎంపీ రఘునందన్ రావ్ కు మావోయిస్టుల నుంచి మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలంటూ రెండు వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు ఫోన్ చేశారు.
ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు ఐదు బృందాలు రంగంలోకి దిగినట్టుగా మావోయిస్టులు తెలిపారు. తమ బృందాలు హైదరాబాద్ లోనే ఉన్నాయని, మరికొద్ది సేపట్లో నిన్ను చంపేస్తామని వారు హెచ్చరించారు. దమ్ముంటే కాపాడుకోవాలని ప్రాణాలు కాపాడుకోవాలని రఘునందన్ రావ్ కు సవాల్ విసిరారు మావోయిస్టులు. తాము మాట్లాడుతున్న ఫోన్ నంబర్లు దొరకవని, సమాచారం కూడా దొరకదని వారు చెప్పారు. ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ వాడుతున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను వదలబోమని మావోయిస్టులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టుగా సమాచారం.
జూన్ 23న రఘునందన్ రావ్ కు బెదిరింపు ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతొ రావడంతో ఆయన రాష్ట్ర డీజీపీ కి ఫిర్యాదు చేశారు. డీజీపీ తో పాటు మెదక్, సంగారెడ్డి ఎస్పీ లకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆర్ముడ్ రిజర్వ్ పోలీసుతో పాటు ఎస్కార్ట్ వాహనం తో రక్షణ కల్పించారు. ప్రస్తుతం అయన కాలికి చికిత్స చేయించుకొని యశోద ఆసుపత్రిలో ఉన్నారు. ఆసుపత్రి నుంచే రఘునందన్ రావ్ పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశారు.
పొలిటికల్ బ్యూరో
కొమ్మెర అనిల్ కుమార్, ఎమ్మే, బీఎడ్