Bibipeta : బీబీపేట మండల కేంద్రంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ముందుగా కలెక్టర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించారు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థుల ప్రతిభ గురించి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధం అయ్యే తీరు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బిబిపేట్ గ్రామపంచాయతీకి సంబంధించిన ఓపెన్ వెల్ ను పరిశీలించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయితీకి నిధులు మంజూరు చేయాలనీ కోరగా వెంటనే కలెక్టర్ మంజూరు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు.
ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణం పనులను పరిశీలించారు. ఇసుక కొరత ఉందని వివరించగా, అందుకు సంబందించిన అనుమతులు జారీచేశారు. నాటిన మొక్కలు ఎదిగే విధంగా చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి నీటి సరఫరా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ తో పాటు కామారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ చందర్ నాయక్ తో పాటు జిల్లా, మండల అధికారులు ఉన్నారు.