Kootami Win : గులాబీ అధినేత కేసీఆర్ రెండు జాతీయ పార్టీల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు కాషాయం. ఈ రెండు పార్టీలకు ఒకరంటే, ఒకరు గిట్టదు. కానీ రెండు పార్టీలు మాత్రం కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. 2028 నాటికి కేసీఆర్ పార్టీ ని కంటికి కనిపించనంత దూరంలోకి నెట్టివేయాలనేది కాంగ్రెస్, బీజేపీ పార్టీల లక్ష్యం. కేసీఆర్ కూడా రెండు పార్టీలతో పోరాడుతూనే తన పూర్వవైభవాన్ని చాటుకోడానికి భారీగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎంచుకున్న ప్రధాన ఆయుధం ఆంధ్ర పెత్తనం. నిధులు, నీళ్లు, నియామకాలు అన్నీ ఆంధ్రావాళ్లే తన్నుకుపోతున్నారు. ఇక్కడ వాళ్ళ పెత్తనం ఏమిటి. మన రాష్ట్రము ఏర్పడితే మనకు పరిపాలించుకోవడం చేతకాదా ?అంటూ ప్రజలను ఆకట్టుకొని ఉద్యమం వైపు మళ్లించారు. ఆలా సెంటిమెంట్ రంగరించి కలిపి తెలంగాణ ప్రజలకు తాగించి సఫలం అయ్యారు కేసీఆర్. ఆ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. తెలంగాణ సాధించారు. పదేళ్లు అధికారంలో ఉన్నారు. పరిపాలన పగ్గాలు కాంగ్రెస్ అందుకుంది. మళ్ళీ అధికారం కావాలంటే ఏమి చేయాలి. తెలంగాణ ప్రజలకు ఎలాంటి సెంటిమెంట్ అయితే నమ్ముతారు. ఇది ఇప్పుడు కేసీఆర్ ముందున్న అసలు సమస్య.
ఏపీలో ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందో అనే ఆలోచనలో పడ్డారు కేసీఆర్. ఏపీ ప్రజల కంటే ఎక్కువగా బిఆర్ఎస్ నేతలు, కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని స్పష్టంచేశారు. జగన్ , కేసీఆర్ ఒక్కటే అనేది రెండు రాష్ట్రాల నాయకులకు, ప్రజలకు తెలుసు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడితే రెండు రాష్ట్రాల విభజన సమస్యలు పరిష్కరం కావు. ఎందుకంటే జగన్, కేసీఆర్ ఒక్కటే కాబట్టి. ఒకవేళ పరిష్కరానికి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వచ్చినా జగన్ స్పందన అంతంత మాత్రమే ఉంటుంది. అప్పడు రాబోయే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యాడు. దద్దమ్మ, చవట, పరిపాలన చేతకాదు, నేను ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లుండే. ఇప్పుడు ఎట్లైనది, అంటూ ప్రజలను రెచ్చగొడుతూ 2028 ఎన్నికలు వెళుతారు కేసీఆర్. ఆ విదంగా కేసీఆర్ కు జగన్ ప్రభుత్వం ఒక ఆయుధం అవుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే రెండు రాష్ట్రాల సమస్యలు పరిస్కారం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అవినాభావ సంబంధం ఉంది. చంద్రబాబుకు నమ్మకస్తుడు అనే పేరు ఉంది. కాబట్టి విభజన సమస్యలు, శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి సమస్యపరిస్కారం అవుతాయి. వాటితోపాటు ఆంధ్ర కు కేటాయించిన భవనాల సమస్య కూడా తేలిపోతుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కేసీఆర్ కు పొరుగు రాష్ట్రము సమస్యలు ఉండవు. కేవలం రాష్ట్రము సమస్యలే ఉంటాయి. ప్రజలను తనవైపు తిప్పుకోడానికి సెంటిమెంట్ ఉండదు. దీనితో కూటమి ఏర్పడితే కేసీఆర్ నోటికి తాళం పడినట్టే అవుతుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.