Mavoist : కేంద్ర ప్రభుత్వ బలగాల తాకిడికి తట్టుకోలేక మావోయిస్టు పార్టీ త్రిశంకు స్వర్గంలో పడింది. ఒకరి తరువాత మరొకరు కీలకమైన నేతలు నేల రాలుతున్నారు. ఎంతటి దట్టమైన అటవీ ప్రాంతమైనా ప్రత్యేక పోలీస్ బలగాలు దూసుకు వెళుతున్నాయి. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ను పార్టీ కోల్పోయింది. కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులకు సైతం బలగాల గురి తప్పడం లేదు.
దామోదర్ స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా ( ప్రస్తుతం ములుగు జిల్లా ) తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. ఇంటర్ చదువుతున్న సమయంలోనే పార్టీకి ఆకర్షితుడై చేరాడు. దామోదర్ పై 70 కి పైగా పోలీస్ కేసులు నమోదయినాయి. అతనిపై రూ : 50 లక్షల రివార్డ్ ఉంది. అప్పటి కార్యదర్శి హరిభూషణ్ జూన్, 2021లో కోవిడ్ తో మరణించడంతో ఆర్మీ చీఫ్ హోదాలో ఉన్న చొక్కారావు రాష్ట్ర కార్యదర్శి భాద్యతలు చేపట్టారు. 2022లో భార్య మడకం కోసి అలియాస్ రజితను ఛత్తీస్ ఘడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చొక్కారావు సైనిక వ్యూహాలు, మెరుపు దాడులు చేయడంలో నిపుణుడు. చొక్కారావు ఇద్దరు అన్నలు మురళి, నాగేశ్వర్ రావు ఆయన కంటే ముందుగానే మావోయిస్టు పార్టీ లో చేరారు. ఇద్దరు అన్నలు కూడా ఎదురు కాల్పుల్లో చనిపోయారు. దామోదర్ మేనకోడలు నాగజ్యోతి ప్రస్తుత ములుగు జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కావడం విశేషం.
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ లొంగిపోడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. 55 ఏళ్ల దామోదర్ పార్టీలో ఏర్పడిన పరిస్థితులు, బలగాల ఒత్తిడి, అనారోగ్యం……కారణం ఏదయినా అయన లొంగిపోడానికి సిద్దమైనట్టుగా గత పదిహేను రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక ముఖ్య నేతతో ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.