Ex CM YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. పని చేయని నాయకులకు ఉద్వాసన పలుకుతున్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దిద్దుబాటు చేపట్టారు. సొంత జిల్లా కడప లో కూడా పదవుల నుంచి తొలగించారు. అత్యంత నమ్మకస్తుడైన విజయసాయి రెడ్డిని ఇంటికి పంపారు. ఇప్పుడు మరో నమ్మిన బంటు సజ్జల రామకృష్ణ రెడ్డి ని కూడా దూరం పెట్టబోతున్నారు. ఒకేసారి దూరం పెట్టకుండా పార్టీ వ్యవహారాలకు ఇప్పుడిప్పుడే సజ్జలను దూరం పెడుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.
పార్టీలో సజ్జల రామకృష్ణ రెడ్డి కి రాష్ట్ర స్థాయిలో మంచి పట్టు ఉంది. గడిచిన ఐదేళ్ల కాలంలో సజ్జల సేవలు సద్వినియోగం చేసుకున్నారు జగన్. పార్టీ ఓటమి చెందిన తరువాత సజ్జలను దూరం పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది పార్టీలో ప్రశ్న తలెత్తింది.
జగన్ లండన్ వెళ్లిపోతున్నారు. ఆయన వచ్చే వరకు పార్టీ వ్యవహారాలను నిర్వహించడానికి సీనియర్ నాయకులను ఎంపిక చేసుకున్నారు. తనకు అనుకూలంగా ఉండే శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి చెబితే ఇక జగన్ చెప్పినట్లే నడుస్తుంది పార్టీలో. అందుకనే వారిద్దరిని పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తున్నారు. లండన్ నుంచి జగన్ వచ్చే వరకు రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలపై ఎక్కువగా బాధ్యతలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ప్రధాన కార్యదర్శులుగా వారిద్దరిని నియమించారని పార్టీ వర్గాల సమాచారం.