రూ.30 కోట్లతో తాగునీటి పథకం..
రూ.7 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్
మందమర్రిలో 50 పడకల ఆసుపత్రి
వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు
రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి పట్టణం, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దశలవారీగా అమలు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడంతో పాటు యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
శుక్రవారం మందమర్రి పట్టణంలోని బి-1 క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మందమర్రి మండల తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, డీసీసీ ప్రతినిధి రఘునాథ్‌లతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను ఎలాంటి జాప్యం లేకుండా రెండు రోజుల్లోగా లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
నిరుపేదలకు 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. రానున్న రెండేళ్లలో మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి, ఐదేళ్లలో మొత్తం నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. మందమర్రి ప్రాంతం ప్రత్యేక భౌగోళిక, పారిశ్రామిక పరిస్థితులు కలిగి ఉన్నందున ఇళ్ల సమస్య పరిష్కారానికి సింగరేణి సంస్థ సీఎండీతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. సింగరేణికి చెందిన భూమిని సేకరించి, అందులో సుమారు వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.
రూ.7 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్
మందమర్రిలో రూ.7 కోట్ల వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు మంజూరు లభించిందని మంత్రి వెల్లడించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలోని సోమనపల్లిలో సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఒకే ప్రాంగణంలో విద్య, వసతి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా పాఠశాలను నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఈ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
68 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం 68 మంది అర్హులైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.జిల్లాలో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పనులు చేపడుతున్నామని తెలిపారు. కోటపల్లి మండలంలో నూతన ఎస్సీ వసతి గృహం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణానికి సుమారు రూ.1.60 కోట్లతో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రామకృష్ణాపూర్‌లో సింగరేణి సంస్థ సహకారంతో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మందమర్రి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

