కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
మండలంలోని సేరి బీబీపేట, రామచంద్రాపూర్ గ్రామాల్లో భూభారతి రీ-సర్వేపై గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు జిల్లా భూముల కొలతల అధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రీ-సర్వే ప్రక్రియ, దాని ప్రాధాన్యతను గ్రామ ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రతి భూమిని సమగ్రంగా కొలవడం జరుగుతుందని, భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామాల సరిహద్దులను స్పష్టంగా గుర్తించి క్రమబద్ధీకరించడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా చూడటమే ఈ రీ-సర్వే ముఖ్య ఉద్దేశమని వివరించారు.
భూములకు సంబంధించిన సరైన వివరాలు, హద్దుల గుర్తింపు విషయంలో గ్రామస్థులు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సదస్సుల్లో తహసీల్దార్, ఎంపీడీవో, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), ఆయా గ్రామాల గ్రామపంచాయతీ అధికారులు (జీపీఓలు), సర్పంచులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

