నకిలీ పట్టాలతో పరిహారం పొందిన వారిపై చర్యలు తీసుకోవాలి
అసలైన భూ బాధితులకు న్యాయం చేయాలి
కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):
కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్ (KK OC) పరిధిలో భూ నష్టపరిహారం పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది వ్యక్తులు నష్టపరిహారం పొందేందుకు కాటపేట శివారు పరిధిలోని సర్వే నంబర్లు 146, 147లో ఇతర ప్రాంతాలకు చెందిన భూముల పట్టాలతో పాటు నకిలీ పట్టాలను వినియోగించి, తమ భూములు ఓపెన్‌కాస్ట్ తవ్వకాలలో కోల్పోయినట్లు అధికారులను తప్పుదోవ పట్టించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ విధంగా భారీ మొత్తంలో నష్టపరిహారం పొందిన కొంతమంది, తిరిగి అదే భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు. ఈ అక్రమాల కారణంగా వాస్తవంగా భూములు కోల్పోయిన అర్హులైన రైతులకు నష్టపరిహారం అందక తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అక్రమంగా పరిహారం పొందడం వల్ల అసలైన భూ యజమానులు భూములతో పాటు పరిహారాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని, రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి తప్పుడు పత్రాలతో ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. భూముల రికార్డులు, పట్టాదారు పత్రాలు, పరిహారం పంపిణీ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజానిజాలు నిగ్గుతేల్చాలని కోరారు.
ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి, అసలైన భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కనుకుల రాకేష్, మాజీ ఎంపీటీసీ బూట్ల వెంకటలక్ష్మి, ఇస్లావత్ రాజేశం తదితరులు పాల్గొన్నారు.

