కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయం చేయాలి
తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకుడు కొరివి నర్సింలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ముదిరాజ్ కులాన్ని బీసీడీ (BC-D) నుంచి బీసీ-ఏ (BC-A)లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకుడు, కామారెడ్డి జిల్లా బీబీపేట మండల ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఆయన ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు.
బీసీలకు ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో అమలు చేయాలని, రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి ప్రతి కులానికి సంబంధించిన జనాభా వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని కోరారు. కులగణన పూర్తయిన అనంతరం జనాభా నిష్పత్తి ఆధారంగా బీసీ వర్గీకరణలో తగిన మార్పులు చేపట్టి, ముదిరాజ్ కులాన్ని బీసీడీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.బీసీలను హామీల పేరుతో మోసం చేయకుండా, ప్రతి కులానికి జనాభా ప్రాతిపదికన రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితర ప్రజాప్రతినిధుల పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ కులగణన వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
బీసీడీ, బీసీ-ఏ తదితర కేటగిరీల్లో ఉన్న కులాల జనాభా ఎంత? ఆయా వర్గాలకు దక్కాల్సిన వాటా ఎంత? అనే అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రతి కులానికి వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కులగణనపై స్పష్టత లేకపోవడం వల్ల బీసీ వర్గాల్లో అనేక సందేహాలు, ఆందోళనలు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే సమగ్ర కులగణన నిర్వహించి, దాని ఆధారంగా ప్రతి కులానికి న్యాయం జరిగేలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కొరివి నర్సింలు కోరారు.

