నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు
పెండింగ్ ఫీజుల విడుదలకు విజ్ఞప్తి
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
తెలంగాణ జన సమితి (టీజేఏస్) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో టీజేఏస్ పార్టీ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులకు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదల చేయాలని, విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులోని 22వ ప్యాకేజీ కింద పనులను చేపట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో తెగిపోయిన చెరువుల కట్టలను పునర్నిర్మించి రైతులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
అలాగే ప్రతిపాదిత బుల్లెట్ రైలు మార్గాన్ని సూర్యాపేట మీదుగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ముంపు గ్రామాలను తెలంగాణలో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని, జహీరాబాద్ ప్రాంతంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేసి తగిన పరిహారం, పునరావాసం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. టీజేఏస్ ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సావధానంగా విని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిజ్జన రమేష్ ముదిరాజ్ తెలిపారు.

