దేశ ఐక్యతకు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం
మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి ఏరియాలోని జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయంలో శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (జాతీయ ఐక్యత దినోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం అనంతరం 562 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి, సమైక్య భారత నిర్మాణానికి విశేష కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. దేశ చరిత్రలో ఆయన ‘ఉక్కు మనిషి’గా చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. దేశాన్ని ఏకం చేయడంలో పటేల్ ప్రదర్శించిన కార్యదీక్ష, దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే భారతీయ సంస్కృతిని కాపాడుతూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ స్వార్థానికి తావులేకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప నాయకుడు పటేల్ అని గుర్తుచేశారు.

అనంతరం ఉద్యోగులు, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఐక్యతతో పనిచేస్తూ, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని, మందమర్రి ఏరియాను సంస్థలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్‌ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, డీవైపీఎం (పర్సనల్) సందీప్, సీనియర్ పీఓ సత్యనారాయణ, ఏఐటీయూసీ జీఎం స్ట్రక్చర్ మెంబర్ సి.వి. రమణతో పాటు పలువురు ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకున్నారు.

