పార్టీ సంస్థాగత బలోపేతం, నూతన నాయకులకు బాధ్యతలపై దిశానిర్దేశం
ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ రాష్ట్ర నాయకులు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
జనసేన పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్లోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్, ప్రచార కార్యదర్శి ఆర్.కె. సాగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, రానున్న ఎన్నికలకు సమర్థవంతంగా సన్నద్ధం కావడమే ఈ సమ్మేళనం ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. పార్టీలో నూతనంగా చేరిన నాయకులకు ఆత్మీయ స్వాగతం పలకడం, వారిని పార్టీ శ్రేణులకు పరిచయం చేయడం, పార్టీ అభివృద్ధిలో వారి పాత్ర, బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే తెలంగాణ జానపద కళలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పడం ఈ ‘అలయ్ బలయ్’ ఆత్మీయ సమ్మేళనం మరో ముఖ్య ఉద్దేశ్యంగా నిర్వాహకులు వెల్లడించారు.

