రోడ్లు, ఆరోగ్య ఉపకేంద్రాల పనులు పూర్తి చేయాలి
లేకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పాదయాత్ర
కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):
మండలంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రోడ్లు, ఆరోగ్య ఉపకేంద్రాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివిధ పార్టీల నాయకులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మండలంలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కాసిపేట మెయిన్ రోడ్డులో సుమారు 500 మీటర్ల మేర రహదారి దెబ్బతిని నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదని నాయకులు పేర్కొన్నారు. కాసిపేట గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదని తెలిపారు. గట్రావుపల్లి ఆరోగ్య ఉపకేంద్రం కూడా 15 ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని ఆరోపించారు. కొండాపూర్ యాప ప్రధాన రహదారిలో సుమారు 30 మీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సమస్యలను ప్రస్తావిస్తూ మండల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే, కాసిపేట గురుకుల పాఠశాలను గత తొమ్మిదేళ్లుగా బెల్లంపల్లిలోని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, దానిని కాసిపేట జెడ్పీఎస్ఎస్ పాఠశాల భవనంలో ఏర్పాటు చేయాలని కోరారు. అక్కడ తరగతి గదులతో పాటు గ్రౌండ్, నీటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించకుండా ఇతర ప్రాంతాల్లో నిర్మాణాల కోసం ప్రయత్నించడం అనుమానాలకు తావిస్తోందని నాయకులు వ్యాఖ్యానించారు. మండలంలోని సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సీపీఐ (ఏఎం) కార్యదర్శి సంకె రవి, టీఆర్ఎస్ పార్టీ కాసిపేట మండల ఇన్చార్జి సోదారి సురేష్, కాసిపేట మండల సీపీఐ సహాయ కార్యదర్శి దుర్గం సుధాకర్, కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ భూక్య తిరుపతి నాయక్, కాంగ్రెస్ నాయకుడు బన్న రాములు తదితరులు పాల్గొన్నారు.

