కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారాంతపు సంతకు వేల సంఖ్యలో రైతులు, వ్యాపారులు తరలివస్తుంటారు. రైతులు పండించిన పంటలను విక్రయించడంతో పాటు వివిధ రకాల వస్తువుల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో మార్కెట్‌కు విశాలమైన స్థలం అవసరమని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ, కొరివి నర్సింలు పేర్కొన్నారు. బీబీపేట మార్కెట్‌లో ప్రతివారం నిర్వహించే వేలంపాట, రోజువారీ సంత ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరుతున్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్ స్థలంలో భవన నిర్మాణం చేపట్టడం వల్ల రైతులు, వ్యాపారులకు సరైన స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. స్థలాభావంతో కొందరు వ్యాపారులు, రైతులు అదే రోజున నిర్వహించే భిక్కనూర్ మార్కెట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
మార్కెట్‌కు కేటాయించిన స్థలాన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నర్సింలు అన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాన్ని మార్కెట్‌కు మరో అనువైన ప్రాంతంలో నిర్మించేందుకు సంబంధిత సంఘానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని సూచించారు. బీబీపేట మార్కెట్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హోల్‌సేల్ మార్కెట్‌గా ప్రకటించి అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్కెట్‌కు వచ్చే ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ విషయంలో అధికారులు, గ్రామ పెద్దలు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నర్సింలు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో మార్కెట్‌కు స్థలం కొరత ఏర్పడకుండా ఇప్పుడే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.రైతులు, వ్యాపారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ స్థలాన్ని కాపాడి, బీబీపేటను హోల్‌సేల్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు కొరివి నర్సింలు తెలిపారు.

