రైతు వేదికల ద్వారా కంది, పెసర విత్తనాల పంపిణీ
వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ
జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రైతు వేదికల ద్వారా కంది, పెసర విత్తనాలను అందజేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఈ. సురేఖ తెలిపారు.
మందమర్రి మండలంలోని సెంట్రోన్‌పల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన “రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు” కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షపాతం అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చెరువుల కింద వరి సాగుపై పూర్తిగా ఆధారపడకుండా, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని రైతులకు సూచించారు.
కంది, మినుము, పెసర, నువ్వులు, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ వర్షపాతం వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడంతో పాటు రైతులు తమ ఆదాయాన్ని స్థిరీకరించుకోవచ్చని పేర్కొన్నారు. రైతు వేదికల ద్వారా తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన కంది, పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే సమతుల్య ఎరువుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, నానో యూరియా, నానో డీఏపీ వినియోగ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.
ఎరువుల డీలర్లు ఎంఆర్పీ (MRP) ధరలకే ఎరువులను విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి హెచ్చరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకునే మార్పులు వ్యవసాయంపై చూపే ప్రభావాల గురించి కూడా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఈ. సురేఖ, వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఏఈఓలు కనకరాజు, రాజశేఖర్, శంకరపల్లి సర్పంచ్ వెంకటేష్, ఉపసర్పంచ్ మణితేజ, పొన్నారం సర్పంచ్ మధు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

