1000 రోజుల పాలన అంతా మోసాల మయం
టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆరోపించారు. మంగళవారం పెద్దపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇస్తామని ప్రకటించిన తులం బంగారం హామీ అమలు ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు.
ఉద్యోగులకు సంబంధించిన పీఆర్‌సీ, పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేస్తూ వారిని ఆందోళనకు గురిచేస్తున్నారని కొమురయ్య యాదవ్ అన్నారు. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
రైతులకు పంట బోనస్ చెల్లింపులో కొర్రీలు, జాప్యాలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మాటలు, హామీలు కాకుండా ప్రజలకు న్యాయం చేయడంతో పాటు వారి హక్కులను కాపాడి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని సలేంద్ర కొమురయ్య యాదవ్ డిమాండ్ చేశారు.

