సింగరేణిలో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాం
టీబీజీకేఎస్‌ది విష ప్రచారం
దమ్ముంటే ప్రెస్‌మీట్‌లో నిజాలు తేల్చుకుందాం
చరిత్ర హీనులు ఎవరో కార్మికులకు తెలుసు
SCWU రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల 24 డిమాండ్ల సాధన కోసం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు నేపథ్యంలో యాజమాన్యంతో రెండు నెలలుగా ఆర్‌ఎల్‌సీ సమక్షంలో చర్చలు జరిపి ఈ నెల 27న చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం మందమర్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తమ యూనియన్ అనేక కీలక డిమాండ్లను ఒప్పందంలో సాధించిందని తెలిపారు. కోల్ ఇండియాలో 13 ఏళ్లుగా అధికారులు పొందుతున్న ఐటీ వెసులుబాటు సింగరేణి కార్మికులకు మాత్రం అందడం లేదని, గతంలో అధికారంలో ఉన్న టీబీజీకేఎస్ ఈ అంశాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించేలా ఒప్పందం కుదిరిందన్నారు. మైనింగ్ స్టాఫ్‌కు పదోన్నతులు లేక ఏళ్లుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఓవర్‌మాన్ తదితర పదోన్నతులకు మార్గం సుగమం చేసేలా ఒప్పందం సాధించామని చెప్పారు. కార్మికుల సొంతింటి పథకానికి కూడా అంగీకారం సాధించామని పేర్కొన్నారు. డిస్మిస్ అయిన కార్మికులకు మరోసారి అవకాశం కల్పించే విధంగా 2023–2025 కాలానికి సంబంధించిన అంశాలపై కూడా ఒప్పందం కుదిరిందన్నారు. గత 15 ఏళ్లలో ఇంత మంచి ఒప్పందం జరగలేదని సీతారామయ్య పేర్కొన్నారు.
అయితే కార్మికులు ఆనందంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక టీబీజీకేఎస్ నాయకులు ఒప్పందంపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒప్పందాన్ని ‘తప్పుడు ఒప్పందం’గా ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. “దమ్ముంటే ప్రెస్‌ముందుకు రండి.. నిజానిజాలు తేల్చుకుందాం. చరిత్రహీనులు ఎవరో కార్మికులే నిర్ణయిస్తారు” అని సవాల్ విసిరారు. కార్మికుల నుంచి చందాలు వసూలు చేసి, అంతర్గత విభేదాలతో కొట్లాడుకుని జైలుకు వెళ్లిన చరిత్ర తమది కాదని, చరిత్రహీనులు ఎవరో సింగరేణి కార్మికులే చెబుతారని అన్నారు.
సింగరేణి ప్రాంతానికి చెందిన పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు గత ఎన్నికల్లో ఓటమికి టీబీజీకేఎస్ చర్యలు, దోపిడీ, కార్మిక వ్యతిరేక విధానాలే కారణమని కేసీఆర్‌కు చెప్పారని ఆయన ఆరోపించారు. అందుకే కేసీఆర్ సింగరేణి ఎన్నికలకు వెళ్లవద్దని సూచించారని పేర్కొన్నారు. “మిమ్మల్ని చరిత్రహీనులని కేసీఆర్ చెప్పినప్పుడు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు” అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తామని టీబీజీకేఎస్ నాయకులు గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. సింగరేణిలో టీబీజీకేఎస్ గెలిచినా 11 నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేకపోయిందని విమర్శించారు. ఈ వాస్తవం ఆ సంఘం నాయకత్వానికి కూడా తెలుసన్నారు.
ఒప్పందాన్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదని, అయితే అందులోని వాస్తవాలను కార్మికులకు వివరించాలని హితవు పలికారు. 11 ఏళ్ల కాలంలో టీబీజీకేఎస్ ఒక్క అగ్రిమెంట్ చేసిందని, ఆ అగ్రిమెంట్‌ను కూడా చివరకు తగలబెట్టారని విమర్శించారు. స్ట్రక్చర్ మీటింగ్‌లు నిర్వహించలేదని ఇప్పుడు ఆరోపిస్తున్నారని, వారి ఐదేళ్ల పాలనలో ఒక్క స్ట్రక్చర్ మీటింగ్ కూడా నిర్వహించలేదని అన్నారు.తాము 84 ఏళ్లుగా కార్మిక రంగంలో పనిచేస్తున్నామని, కార్మిక చట్టాలు, కార్మిక సంఘాల గురించి అవగాహన లేని వారు కార్మిక సంఘాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని గతంలో గెలిచినప్పటికీ ఇప్పుడు తమ అసలు వైఖరి కార్మికులకు పూర్తిగా అర్థమైందని వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మందమర్రి ఏరియా యానియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.

