అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలి
మందమర్రి టీఆర్‌ఎస్ నాయకులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు సూరిబాబు, బత్తుల శ్రీనివాస్, తదితరులు మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
అర్హత లేని వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించారని వారు విమర్శించారు. లక్కీ డ్రాకు పది రోజుల ముందు వరకు అర్హుల జాబితా అందుబాటులో ఉండగా, ఆ తర్వాత అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ తమకు అనుకూలమైన వారికి మాత్రమే ఇళ్లు కేటాయించారని ఆరోపించారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించి, నిజమైన అర్హులు, నిరుపేదలకు మాత్రమే ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

