సీనియర్ జర్నలిస్టుల నేతృత్వంలో ‘ప్రభాత ఉదయం’
ప్రింట్‌తో పాటు డిజిటల్‌పై దృష్టి
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ మీడియా రంగంలోకి మరో కొత్త దినపత్రిక అడుగుపెట్టబోతోంది. సీనియర్ జర్నలిస్టుల అనుభవం, నూతన ఆలోచనల సమ్మేళనంగా ‘ప్రభాత ఉదయం’ పేరుతో కొత్త దినపత్రిక త్వరలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ పత్రికకు సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్‌రెడ్డి నేతృత్వం వహించనుండగా, మరో సీనియర్ జర్నలిస్ట్ వేమూరి వంశీకృష్ణ పబ్లిషర్‌గా వ్యవహరించనున్నారు. కట్టా శేఖర్‌రెడ్డి గతంలో ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘకాలం జర్నలిజం అనుభవాన్ని సంపాదించారు. నమస్తే తెలంగాణ పత్రికలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. నెట్‌వర్క్ బాధ్యతలను ప్రముఖ పాత్రికేయుడు దివంగత అరుణ్ సాగర్ సోదరుడు జగన్మోహన్‌కు అప్పగించారు. ఆసక్తికర విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతి చీఫ్ వేమూరి రాధాకృష్ణ సోదరుడి కొడుకు వేమూరి వంశీకృష్ణ ఈ కొత్త పత్రికకు పబ్లిషర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం సమాచార విప్లవం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిజం స్వరూపం కూడా గణనీయంగా మారిపోయింది. ఒకప్పుడు వార్తల కోసం ప్రధాన ఆధారంగా ఉన్న దినపత్రికల స్థానాన్ని స్మార్ట్‌ఫోన్లు, న్యూస్ యాప్స్, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఫిజికల్ న్యూస్ పేపర్ చదివే అలవాటు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో కొత్తగా ఒక ప్రింట్ దినపత్రికను ప్రారంభించడం ఆర్థికంగా, నిర్వహణపరంగా సవాళ్లతో కూడుకున్న నిర్ణయమేనని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. భారీ పెట్టుబడులు, ముద్రణ, పంపిణీ వ్యవస్థ, సిబ్బంది నిర్వహణ, ప్రకటనల మార్కెట్ వంటి అనేక అంశాలను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అయితే, ఈ పరిస్థితుల్లోనూ ప్రింట్ మీడియాను పునాదిగా ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహాత్మక ఆలోచన ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. డిజిటల్ మీడియా వేగంగా వార్తలను అందిస్తున్నప్పటికీ, వార్తల విశ్వసనీయత, వాస్తవ నిర్ధారణ, సామాజిక ప్రామాణికత వంటి అంశాలపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒక బలమైన ప్రింట్ బ్రాండ్‌ను నిర్మించుకుని, దాని విశ్వసనీయతను డిజిటల్, సోషల్ మీడియా వేదికలకు విస్తరించడం కొత్త పత్రికకు కీలక వ్యూహంగా మారే అవకాశం ఉంది. ప్రింట్ పత్రికను కేవలం కాగితపు ఎడిషన్‌కే పరిమితం చేయకుండా, డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు, వీడియో కంటెంట్ వంటి విభాగాలతో అనుసంధానం చేస్తే మారుతున్న పాఠకుల అభిరుచులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా ఈ పత్రిక ఎక్కువగా డిజిటల్ పైనే దృష్టి పెట్టబోతుందని తెలిసింది. మొదట్లో కేవలం 20 వేల కాపీలకే ప్రింట్ ను పరిమితం చేయాలన్నది యాజమాన్య విధానంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఈ పత్రిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డమ్మీ వర్క్ మాత్రం వేరే దగ్గర చేస్తున్నారు. నియామక ప్రక్రియను త్వరగా పూర్తిచేసి పాఠకుల ముందుకు పత్రికను తీసుకొచ్చేలా యాజమాన్యం ప్రయత్నిస్తోందని తెలిసింది.

