కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.
ఈ మేరకు పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు, విద్య, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి చెరో రూ.కోటి చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. అలాగే సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మ బాగోగులు, అవసరాల కోసం మరో రూ.25 లక్షలను బ్యాంకులో జమ చేయనున్నారు.
సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. పిల్లల భవిష్యత్తు, చదువు, కుటుంబ సంక్షేమానికి పార్టీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

