కార్మిక సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
గుర్తింపు కార్మిక సంఘంతో 20వ సమీక్షా సమావేశం
మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తి లక్ష్యాల సాధనకే పరిమితం కాకుండా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తోందని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘంతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.
సింగరేణి అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మిక సంఘాల పాత్ర ఎంతో కీలకమని జీఎం పేర్కొన్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాల అమలు పురోగతిని సమీక్షిస్తూ, సంస్థ అభివృద్ధితో పాటు కార్మిక సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గుర్తింపు సంఘం నాయకులు పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆపరేటర్లకు అవసరమైన పనిముట్లు, రైన్‌కోట్లు అందించాలని, పెండింగ్‌లో ఉన్న టెండల్ సూపర్వైజర్ ప్రమోషన్ పరీక్షలను వెంటనే నిర్వహించాలని కోరారు. వర్క్‌షాప్‌లో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు ఎస్ & పీసీ మహిళా సెక్యూరిటీ గార్డులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే కాసిపేట-1, 1ఏ, 2 గనులకు వెళ్లే రహదారులను మరమ్మతు చేయడం, రోడ్లకు ఇరువైపులా పెరిగిన పొదలను తొలగించడం, వీధి దీపాలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రహదారి భద్రతను మెరుగుపరచాలని సూచించారు. జీఎం కార్యాలయంలో మహిళా టాయిలెట్ సమీపంలో ప్రహరీ గోడ నిర్మాణాన్ని కూడా చేపట్టాలని కోరారు.
యూనియన్ ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై జీఎం రాధాకృష్ణ సానుకూలంగా స్పందించారు. అర్హత కలిగిన అన్ని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మికులు, కార్మిక సంఘాలు అందిస్తున్న సహకారం అభినందనీయమని, భవిష్యత్తులోనూ ఇదే సహకారం కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.
సమావేశంలో ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ కార్యదర్శి అక్బర్ అలీ, ఏఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ వెంకటస్వామితో పాటు సంస్థకు చెందిన ఎస్.ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, డీజీఎంలు అశోక్, కిరణ్ కుమార్, షేక్ మదీనా భాష, రవీందర్, నరేష్, వెంకటేశ్వర రెడ్డి, నవీన్, కార్తీక్ తదితర అధికారులు, యూనియన్ నాయకులు సుదర్శన్, సి.వి. రమణ, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

