36.1 C
Munich
Thursday, July 30, 2026

ఉజ్జయిని బోనం మొక్కులు మొదట చెల్లించింది ఎవరో తెలుసా ?…

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆవిర్భావం..
ప్లేగు మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలనే మొక్కుతో ప్రారంభమైన చరిత్ర
1813 ప్లేగు మహమ్మారి
ప్రజల కోసం చేసిన ఒక భక్తుని సంకల్పం

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): 

హైదరాబాద్‌, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 1813 సంవత్సరంలో ప్లేగు మహమ్మారి తీవ్రంగా విజృంభించింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా, ప్రజల దుస్థితిని చూసి సైనిక దళంలో డోలీ మోసే సురితి అప్పయ్య తీవ్రంగా కలత చెందాడు. ఆయన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి పరమ భక్తుడు.

ఆ సమయంలో ప్లేగు మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి లభించి, అందరూ సురక్షితంగా ఉంటే ఉజ్జయిని నుంచి మహాకాళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి సికింద్రాబాద్‌లో ప్రతిష్ఠిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాడు.

మొక్కు తీర్చుకున్న సురితి అప్పయ్య

కొద్ది రోజుల తర్వాత ప్లేగు వ్యాధి తీవ్రత తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. తన మొక్కు ప్రకారం సురితి అప్పయ్య ఉజ్జయిని నుంచి మహాకాళి అంశాన్ని ఆవహింపజేసిన రెండు చెక్క విగ్రహాలను సికింద్రాబాద్‌కు తీసుకొచ్చాడు.

ఆ రెండు విగ్రహాలను 1814 సంవత్సరంలో ఆషాఢ మాసంలో ప్రతిష్ఠించాడు. వాటిలో ఒకటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, మరొకటి శ్రీ మాణిక్యాల దేవిగా పూజలు అందుకుంటున్నాయి.

ఆలయ నిర్మాణం.. ఉత్సవాల సంప్రదాయం

విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం 1815లో ఆలయ నిర్మాణం చేపట్టారు. అమ్మవారిని ఆషాఢ మాసంలో ప్రతిష్ఠించిన నేపథ్యంలో, ప్రతి ఏడాది అదే మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయం ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ ఉత్సవాలు తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే ఆధ్యాత్మిక వేడుకలలో ఒకటిగా గుర్తింపు పొందాయి.

చెక్క విగ్రహాల స్థానంలో రాతి విగ్రహాలు

ప్రారంభంలో ప్రతిష్ఠించిన చెక్క విగ్రహాలకు బదులుగా 1864 సంవత్సరంలో రాతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నేటి వరకు అదే ఆలయంలో మహంకాళి అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటూ కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తున్నారు.

ఆషాఢ బోనాల వైభవానికి నాంది

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ చరిత్ర ప్లేగు మహమ్మారి సమయంలో ఒక భక్తుడు చేసిన మొక్కుతో ప్రారంభమైంది. ఆ సంకల్పమే నేడు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ బోనాల మహోత్సవాలకు నాంది పలికింది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.