పనుల్లో పారదర్శకత, వేగం పెంచాలి:
మందమర్రి ఏరియాలో ఇంటర్నల్ ఆడిట్ సమీక్ష సమావేశం
ఆడిట్ అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి
సింగరేణి ఇంటర్నల్ ఆడిట్ జీఎం చుక్క మురళీధర్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
సింగరేణి సంస్థలో అన్ని విభాగాల్లో పనుల నిర్వహణలో మరింత పారదర్శకత, వేగం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆడిట్‌కు సంబంధించిన అభ్యంతరాలు, అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సింగరేణి సంస్థ ఇంటర్నల్ ఆడిట్ జనరల్ మేనేజర్ చుక్క మురళీధర్ అధికారులకు సూచించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఇంటర్నల్ ఆడిట్ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇంటర్నల్ ఆడిట్ నివేదికలు, ప్రభుత్వ ఆడిట్ గమనింపులు (అబ్జర్వేషన్లు), భూసేకరణ, స్థల సంబంధిత అంశాలు, మైనింగ్, స్టోర్స్ నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రతి విభాగంలో ఆడిట్ అభ్యంతరాలను సకాలంలో పరిష్కరించి, సంస్థ పనితీరును మరింత మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు.
సమావేశం అనంతరం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కలిసి జీఎం చుక్క మురళీధర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి జనరల్ మేనేజర్ ఎం. రమేష్, ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, కైరిగూడ ప్రాజెక్టు అధికారి ఎం. నరేందర్, ఎస్‌ఎస్‌వో (ఎస్ & పీసీ) వెంకటేశ్వర రెడ్డి, జీఎం కార్యాలయ ఉన్నతాధికారులు, ఇంటర్నల్ ఆడిట్ అధికారులు పాల్గొన్నారు.

