19.9 C
Munich
Sunday, July 26, 2026

Mavoist : ముప్పాల …నీ మౌనం దేనికి సంకేతం…..

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మావోయిస్టుకు అంతం లేదంటున్నారు మాజీలు
యుద్ధం కొనసాగుతుందంటున్న అధికార ప్రతినిధి
సమీపిస్తున్న కేంద్రం గడువు

Mavoist : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి (76) లొంగుబాటు గురించి సోషల్ మీడియాతో పాటు పలు మీడియా ఛానల్లో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించిన నాయకుడు. 1972 లో అడవిబాట పట్టి, పార్టీ చీఫ్ గా ఎదిగారు. 1976 లో పీతాంబర్ రావు హత్య కేసులో ఒకే ఒక్కసారి అరెస్ట్. 1978 లో జగిత్యాల జైత్ర యాత్రలో ప్రజల సమక్షములో ప్రసంగం. ఆ రెండు సంఘటనలు మినహాయిస్తే ముప్పాల ముఖం చూసిన వారు నేటికీ లేరు. పార్టీ సమావేశాల్లోనే ఆయన కనిపిస్తారు. పోలీస్ బలగాలకు చిక్కకుండా పార్టీని 25 ఏళ్ళు నడిపించిన ఏకైక నాయకుడు. నేటికీ కూడా అయన రహస్య స్థావరం కూడా ఎక్కడ ఉంటుందో పార్టీలో ఎవ్వరికి తెలియదనే అంటారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం బీర్పూర్ నివాసి. అదే జిల్లా ఎలిగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి. 1972 లో దళసభ్యుడిగా చేరిక. అంచెలంచెలుగా ఎదిగి 1993 లో కొండపల్లి సీతారామయ్య తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి భాద్యతలు చేపట్టారు. 2018 వరకు ఆ పదవిలో కొనసాగారు. 25 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా రెండోసారి చిక్కకుండా 17 రాష్ట్రాలకు పార్టీని విస్తరించారు. అటువంటి వ్యక్తి లొంగిపోవడంపై వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు లొంగిపోయిన ప్రధాన మావోయిస్టు నేతలతో చర్చలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైనది. ముప్పాల ఆలోచనలు ఎంత బలమైనవో 25 ఏళ్ళు పార్టీని నడిపిన చరిత్రే ఇందుకు పెద్ద తార్కాణం. అటువంటి బలమైన నేతను నమ్మించి, చర్చలు నిర్వహించి, ఒప్పించి తెలంగాణ ప్రభుత్వం ఎదుటకు తీసుకురావడం కూడా కష్టమే అంటున్నారు ఆయన వ్యక్తిత్వం తెలిసిన మాజీలు. ఒకవేళ ఆయన లొంగిపోడానికి సిద్ధమైతే ఆయనను నమ్ముకొని పార్టీని నడిపి జైలుకు వెళ్లిన వారి పరిస్థితి ఏమిటి. కోర్టు కేసులు మోస్తున్న నాయకులకు, ప్రాణ త్యాగం చేసిన వారి కుటుంబాలకు ఎటువంటి న్యాయం చేస్తావని వారి కుటుంబ సభ్యులు మావోయిస్టు దళపతి గణపతిని ప్రశ్నిస్తున్నారు.

మావోయిస్టు ముప్పాల లక్ష్మణ్ రావు 2023 లో పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించారని కొందరు మాజీలు ఇటీవల ప్రకటించారు. అంటే ఆయన ఇండియాలోనే సుస్టిరమైన స్థావరంలో ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్ వెళ్ళాడు, శ్రీ లంక వెళ్ళాడు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా తప్పంటున్నారు కొందరు. ఆయన నడవలేని స్థితిలో ఉన్నట్టుగా 2023 సమావేశంలోనే స్పష్టమైనది. ఆయన తన స్థావరం మారాలన్నా, ఉన్నటువంటి స్థావరానికి వెళ్లి కలవాలన్నా ఐదంచెల భద్రతతో వ్యవస్థ ముడిపడి ఉంటది. కాబట్టి అటువంటి నాయకుడు దేశం విడిచి వెళ్లే పరిస్థితి కూడా అంత సులభం కాదంటున్నారు కొందరు మాజీ నేతలు.

గత కొన్ని నెలలుగా కొందరు లొంగిపోతున్నారు. ఒకరిద్దరి అధికార ప్రతినిధుల పేరిట మీడియాకు లేఖలు అందుతున్నాయి. లొంగిపోయే ప్రసక్తే లేదు. యుద్ధం కొనసాగుతుంది అంటూ ఆ లేఖలో అధికార ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీకి అంతం లేదు. పార్టీ కొనసాగుతోందంటూ ఇటీవల లొంగిపోయిన కొందరు నేతలు కూడా స్పష్టం చేశారు. ఇన్ని విధాలుగా పార్టీపై అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ మావోయిస్టు ముప్పాల లక్ష్మణ్ రావు మాత్రం నోరు మెదపడం లేదు. ఆయన మదిలో ఉన్న విషయం బహిర్గతం చేయడంలేదు. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ముప్పాల లక్ష్మణ్ రావు నీ మౌనం దేనికి సంకేతమంటున్నారు నిన్ను నమ్ముకున్న పలువురు మావోయిస్టు నేతలు,
————————–
సీనియర్ జర్నలిస్ట్
సీహెచ్ . పరశు రాం యాదవ్
నిగమ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
9603505050
————————–

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.