నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను సమర్థవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు.bమంగళవారం మందమర్రి మండలం సారంగపల్లి, ఆదిలపేట, పొన్నారం గ్రామపంచాయతీల పరిధిలో వి.బి.జి. రామ్‌జీ పథకం కింద కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సారంగపల్లిలో నూతనంగా నిర్మించిన మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్, సీసీ వర్క్‌సైట్ పనులను పరిశీలించారు. ఆదిలపేట గ్రామపంచాయతీలోని పీటీ వర్క్‌సైట్‌ను తనిఖీ చేశారు.
అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించాలని అవగాహన కల్పించారు.మూడు గ్రామపంచాయతీల పరిధిలో పథకంలో భాగంగా చేపడుతున్న ఇంకుడు గుంతలు, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ రీఛార్జ్ స్ట్రక్చర్లు, బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ల నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. గ్రామాల్లోని వీఓ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి వాటి పనితీరును సమీక్షించారు.
రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, కరువు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీటి సమస్యల నివారణకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.గ్రామాల్లోని నీటి వనరుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని, అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఏఈలు, ఉపాధి హామీ ఏపీఓ, ఈసీ, టీఏ, పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

