NIGAMA MEDIA (P) LTD
6.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, November 10, 2026

తెలంగాణ బీజేపీలో సంస్థాగత ప్రక్షాళనకు కసరత్తు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

రాష్ట్ర కమిటీలో మరో ఐదు పదవుల భర్తీకి హైకమాండ్‌ యోచన
ఆశావహుల లాబీయింగ్‌ ముమ్మరం

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వాన్ని పటిష్ఠం చేసేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీలో ఖాళీగా ఉన్న, కొత్తగా ఏర్పాటు చేయనున్న మరికొన్ని పదవులను భర్తీ చేయాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్ర బీజేపీ పదాధికారుల కమిటీలో కొత్తగా మరో ఐదు పదవులను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది కార్యదర్శులు కొనసాగుతున్నారు. వీటికి అదనంగా ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు కార్యదర్శులను నియమించే అవకాశాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియామకాల ద్వారా పార్టీకి దీర్ఘకాలంగా సేవలందిస్తున్న నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పించడంతోపాటు, గతంలో పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న నేతలను సంతృప్తిపరిచే దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.

పదవుల కోసం ఆశావహుల ప్రయత్నాలు

కొత్త పదవుల భర్తీపై ప్రచారం ఊపందుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీజేపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం చేసిన సేవలు, సంస్థాగత అనుభవం, గతంలో నిర్వహించిన బాధ్యతలు, క్షేత్రస్థాయిలో నాయకత్వ సామర్థ్యం వంటి అంశాలు నియామకాల్లో కీలకం కానున్నట్లు సమాచారం. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను ఎంత సమర్థవంతంగా నిర్వహించారు? ప్రజల్లో పార్టీని ఎంతవరకు విస్తరించగలిగారు? వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందని నేతల మధ్య చర్చ సాగుతోంది. రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పడటంతోపాటు, జాతీయ నాయకత్వం నుంచి సానుకూల సంకేతాలు పొందేందుకు ఆశావహులు తమ రాజకీయ పరిచయాలను ఉపయోగించుకుంటూ దిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బాధ్యతల పునర్విభజనకు అవకాశం

కొత్త పదాధికారుల నియామక ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర కమిటీలో బాధ్యతల పునర్విభజన జరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్న నాయకులకు అప్పగించిన బాధ్యతల్లో మార్పులు చేయడంతోపాటు, కొత్తగా నియమితులయ్యే వారికి ప్రత్యేక విభాగాలను కేటాయించే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయడం, సంస్థాగత విస్తరణ, ప్రజా సమస్యలపై పోరాటాలు, వివిధ మోర్చాల సమన్వయం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునే వ్యూహం

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లభించే ప్రతి రాజకీయ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీని అధికార దిశగా నడిపించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో పర్యటించడం, ఆయన పాల్గొన్న కార్యక్రమాలకు భారీగా ప్రజలు తరలిరావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్లు భావిస్తున్నారు.

కేవలం బహిరంగ సభలు, రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేయడమే లక్ష్యంగా అధిష్ఠానం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, ప్రతి జిల్లాలో పార్టీ కార్యక్రమాలను విస్తరించడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించడం ద్వారా రాజకీయంగా బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని కాషాయదళం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కొత్త పదవుల భర్తీతో తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ఎవరికి కీలక బాధ్యతలు దక్కుతాయి? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.