NIGAMA MEDIA (P) LTD
4.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, October 23, 2026

ఆయిల్ పామ్ సాగుతో సింగరేణి సంస్థకు ఆదాయం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మందమర్రి ఏరియాలో సింగరేణి డైరెక్టర్ కే. వెంకటేశ్వర్లు పర్యటన
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

ఆయిల్ పామ్ సాగుతో పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు సంస్థకు దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతుందని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) కే. వెంకటేశ్వర్లు అన్నారు. మందమర్రి ఏరియాలోని మూసివేసిన కేకే-2 గని సమీపంలో నర్సరీ వెనుక భాగంలో రెండు హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌లో గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఆయిల్ పామ్ సాగు కార్యక్రమాన్ని డైరెక్టర్ అభినందించారు. సింగరేణిలోని ఇతర ఏరియాల్లో లేని విధంగా మందమర్రి ఏరియాలో వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఆయిల్ పామ్ మొక్కల జీవితకాలం సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని, వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో సంరక్షిస్తే సంస్థకు మంచి ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. మందమర్రి ఏరియాను ఆదర్శంగా తీసుకుని సింగరేణిలోని ఇతర ఏరియాల్లోనూ ఈ ప్లాంటేషన్‌ను విస్తరించాలని సూచించారు.

అంతకుముందు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయానికి చేరుకున్న డైరెక్టర్ కే. వెంకటేశ్వర్లుకు జీఎం ఎన్. రాధాకృష్ణతో పాటు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఏరియాలోని ప్రాజెక్టులు, గనుల పనితీరు, బొగ్గు ఉత్పత్తి, ఉత్పత్తి లక్ష్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై గనుల ఏజెంట్లు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ప్రణాళికలను పరిశీలించి, నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు పలు సూచనలు చేశారు. తదుపరి కేకే ఓసీపీ వ్యూ పాయింట్‌ను సందర్శించి, క్వారీలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడంతో పాటు రక్షణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. సమష్టి కృషితో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిష్ఠాత్మకమైన శ్రావణపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాంతాలు, గ్రామాలను కూడా పరిశీలించారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు….

మందమర్రి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు చెత్లాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పంప్‌హౌస్‌ను డైరెక్టర్ కే. వెంకటేశ్వర్లు, జీఎం ఎన్. రాధాకృష్ణతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. మూసివేసిన కేకే-1 గనిలోని నీటిని పంప్‌హౌస్‌కు తరలించి, శుద్ధి చేసిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు జీఎం రాధాకృష్ణ వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు నీటి కొరత రాకుండా సింగరేణి యాజమాన్యం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలంతా నీటిని, విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ పర్యటనలో మందమర్రి ఏరియా ఎస్‌ఓటు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ (ఈ అండ్ ఎం) బాలాజీ భగవతి ఝా, కేకే ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ రాంబాబు, కేకే గ్రూప్ ఏజెంట్ ఖాదిర్, శాంతిఖని ఏజెంట్ సంతోష్ కుమార్, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, అటవీ అధికారి నవీన్, డీజీఎం (సివిల్) మదీనా భాష, డీజీఎం (సర్వే) భూక్య దేశాయ్, ఏరియా సెక్యూరిటీ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, వర్క్‌షాప్ ఇన్‌చార్జి డీజీఎం నరేష్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.