NIGAMA MEDIA (P) LTD
11.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, October 7, 2026

మహాత్మ జ్యోతిబా ఫూలే విగ్రహ స్థలం వివాదంపై BC సంఘాల ఆవేదన

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఫూలే విగ్రహానికి కేటాయించిన స్థలంలో కాకా విగ్రహానికి భూమిపూజపై అభ్యంతరం
ఇద్దరు మహనీయులకు వేర్వేరు స్థలాలు కేటాయించాలి
బీసీ సంఘాల డిమాండ్‌
రేపు మీడియా సమావేశం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి పట్టణంలోని పార్కు ముందు ఉన్న ఖాళీ స్థలంలో విగ్రహాల ఏర్పాటుపై వివాదం నెలకొంది. గతంలో మహాత్మ జ్యోతిబా ఫూలే విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించి, స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చిన అధికారులు, అదే స్థలంలో తాజాగా స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేయడంపై బీసీ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేష్, మందమర్రి పట్టణ అధ్యక్షుడు సకినాల శంకర్ మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిబా ఫూలే విగ్రహ ఏర్పాటుకు గతంలో సింగరేణి అప్పటి జనరల్ మేనేజర్, సంబంధిత అధికారుల సమక్షంలో అధికారికంగా భూమిపూజ నిర్వహించారని తెలిపారు. అప్పట్లో బీసీ సంఘాలు, స్థానిక నాయకులకు అదే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

ఫూలే విగ్రహం విషయంలో వెనక్కి తగ్గేది లేదు

మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన మహనీయుడని, మహిళా విద్యకు బాటలు వేసి బాలికల విద్య కోసం పోరాడారని నాయకులు గుర్తుచేశారు. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని మందమర్రిలో ఏర్పాటు చేయడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. అయితే, గతంలో ఫూలే విగ్రహానికి కేటాయించిన స్థలంలోనే మరో విగ్రహానికి భూమిపూజ నిర్వహించడం తమను బాధించిందన్నారు. స్వర్గీయ కాకా వెంకటస్వామి కూడా గౌరవనీయులేనని, ఆయన విగ్రహ ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికే ఫూలే విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో కాకా విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడమే తమ అభ్యంతరమని తెలిపారు. పట్టణంలో ఇతర ఖాళీ స్థలాలు ఉన్నందున కాకా వెంకటస్వామి విగ్రహానికి మరో స్థలం కేటాయించాలని కోరారు. ఇద్దరు మహనీయుల విగ్రహాలకు తగిన గౌరవం దక్కేలా అధికారులు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అధికారులు స్పష్టత ఇవ్వాలి

ఈ స్థలానికి సంబంధించి నిర్ణయం ఎవరు తీసుకున్నారు? సంబంధిత అధికారుల ఆమోదం ఉందా? మంత్రి వివేక్ వెంకటస్వామికి ఈ విషయం తెలుసా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన భూమిపూజకు సంబంధించిన రికార్డులు మున్సిపాలిటీలో ఉన్నాయని, వాటిని పరిశీలించి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని కోరారు. మున్సిపల్ అధికారులు, సింగరేణి యాజమాన్యం ఈ వ్యవహారంపై స్పందించాలని అన్నారు. విగ్రహాల ఏర్పాటుకు స్థలాల కేటాయింపులో పారదర్శకత ఉండాలని, ఇష్టానుసారంగా స్థలాలను మార్చడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. అన్ని కుల సంఘాలతో చర్చించి, తగిన కమిటీ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

రేపు మీడియా సమావేశం.. కలెక్టర్‌కు వినతి

ఈ అంశంపై మందమర్రిలోని వివిధ కుల సంఘాలను కలుపుకొని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు నేరెళ్ల వెంకటేష్, సకినాల శంకర్ తెలిపారు. అనంతరం కలెక్టర్, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేయడంతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతామని వెల్లడించారు. మహాత్మ జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని గతంలో కేటాయించిన స్థలంలోనే ఏర్పాటు చేయాలని, లేదంటే అంతకంటే మెరుగైన స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. కాకా వెంకటస్వామి విగ్రహానికి మరో స్థలం కేటాయించి, ఇద్దరు మహనీయులకు సముచిత గౌరవం కల్పించాలని కోరారు. ఈ వివాదాన్ని రాజకీయాలకు అతీతంగా పరిష్కరించి, పట్టణంలో సామరస్య వాతావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు త్వరగా స్పందించి స్పష్టత ఇవ్వాలని, న్యాయం జరిగే వరకు బీసీ సంఘాల పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.