యాదవుల్లో విద్యా చైతన్యమే లక్ష్యంగా యాత్ర
జూలపల్లిలో నిర్వాహకులకు ఘన సన్మానం
కోల్ బెల్ట్ న్యూస్(జూలపల్లి):
యాదవ సమాజంలో విద్యా చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు అట్టడుగు వర్గాలకు విద్యను చేరువ చేయాలనే గొప్ప సంకల్పంతో కొనసాగుతున్న శ్రీకృష్ణ సేవ–విద్యా చైతన్య యాత్రకు యాదవ ప్రముఖులు బుధవారం సంఘీభావం తెలిపారు. జూలపల్లి మండల కేంద్రంలో యాత్ర నిర్వహిస్తున్న శ్రీకృష్ణ మాలాధారకులు మారం తిరుపతి యాదవ్, మేకల నరసయ్య యాదవ్లను వారు కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా యాదవ్ విద్యావంతుల వేదిక వ్యవస్థాపకులు, తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఇన్‌చార్జి మేకల మల్లేశం యాదవ్లు యాత్రకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.
వారు మాట్లాడుతూ.. సమాజంలో విద్యకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలను విద్యావంతులుగా, విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ యాత్ర ఒక మహా యజ్ఞం లాంటి కార్యక్రమమని కొనియాడారు. యాదవ సమాజంలో విద్య పట్ల అవగాహన పెంపొందించేందుకు, యువత ఉన్నత విద్య వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించేందుకు ఈ యాత్ర ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
శ్రీకృష్ణ సేవ–విద్యా చైతన్య యాత్ర తెలంగాణ రాష్ట్రానికి ఒక మార్గదర్శక కార్యక్రమంగా నిలిచే అద్భుతమైన ప్రయోగమని వారు పేర్కొన్నారు. విద్య ద్వారానే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి కుటుంబం తమ పిల్లలను ఉన్నత విద్య వైపు నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రకు ప్రజల నుంచి మరింత మద్దతు లభించి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు.
యాదవ సమాజంలో చైతన్యానికి ఈ యాత్ర నాంది పలుకుతుందని, విద్యా ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేయడంలో యాత్ర నిర్వాహకులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అనంతరం యాత్రను కొనసాగిస్తున్న మారం తిరుపతి యాదవ్, మేకల నరసయ్య యాదవ్లను శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జూలపల్లి గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు కొమ్మ ఐలయ్య యాదవ్, ఉపాధ్యక్షుడు మల్లెత్తుల కనకయ్య యాదవ్, కోశాధికారి మారం వెంకటరమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

