22 C
Munich
Monday, July 27, 2026

BJP : సీనియర్లకు దక్కని కమలం సీటు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

పక్క చూపు చూస్తున్న పలువురు నేతలు
ఊగిసలాటలో మరికొందరు
కష్టపడిన వారికి పదవులు కరవు
అత్తెసరు పదవులతో అసంతృప్తి

BJP : జెండా మోయాలి. బ్యానర్ కట్టాలి. కటౌట్ పెట్టాలి. జనం సమీకరించాలి. నినాదాలు చేయాలి. ఇంత చేసినా జిల్లా, రాష్ట్ర స్థాయిలో కాకపోయినా కనీసం బూత్ కమిటీలో సీటు దక్కక పాయె. పార్టీ కోసం కష్టపడితే ఫలితం దక్కకపాయె అంటూ కమల నాధులు మంచిర్యాల జిల్లాలో లోలోన కుమిలిపోతున్నారు. ఇటీవలనే మంచిర్యాల జిల్లా స్థాయి నూతన కమిటీని నిర్మించారు. తాజాగా రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా నుంచి ఒకే ఒక్క పదవి రాష్ట్ర కమిటీలో చోటుచేసుకోవడం శోచనీయమంటున్నారు పలువురు కమలనాథులు. పదవుల ఎంపిక నేపథ్యంలో సీనియర్ నేతలకు, జూనియర్ నేతలకు మధ్య తేడా ఏర్పడిందనె అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

1981 లో బీజేపీ తరుపున మంచిర్యాల మున్సిపాలిటీ లో 21 స్థానాలకు 21 మంది బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో నలుగురు కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత కూడా ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. అప్పుడు బూతు కమిటీలు లేవు. ఇంతగా ప్రచారం చేసుకోడానికి సోషల్ మీడియా లేదు. ప్రచారానికి నేడు అనేక సాధనాలు ఉన్నప్పటికీ ఆనాటి బలం నేడు కనుమరుగయి పోవడంపై సీనియర్ నేతలు ఆవేదనకు లోనవుతున్నారు. గత ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేయడానికి కమలనాథులు కరువైపోవడం విశేషం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే రాబోయే మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ముందుకు రావడం కూడా అనుమానమే అంటున్నారు పలువురు బీజేపీ శ్రేణులు.

కొత్తవారికి అవకాశం ఇవ్వాలనేది పార్టీ ఉద్దేశం అంటారు కొందరు పెద్దలు. మరి ఇన్నేళ్లు జెండా మోసిన వారు ఏమి చేయాలో చెప్పాలంటున్నారు పలువురు జిల్లా సీనియర్ నేతలు. కుటుంబానికి దూరమై, ఆర్థికంగా నష్టపోయి పార్టీకి సేవ చేస్తే గౌరవం ఇదేనా అంటున్నారు పలువురు. బూత్ కమిటీలతోనే పార్టీ అభివృద్ధి చెందుతుందనేది పార్టీ ఉద్దేశ్యం. అటువంటి నిర్ణయాన్ని అమలు చేయకుండా జిల్లా కమిటీ కాలయాపన చేయడంపై కూడా తీవ్ర అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అంతే కాదు పార్టీ అనుబంద సంఘాల నిర్మాణానికి కూడా ముహూర్తం కుదరకపోవడం శోచనీయమంటున్నారు బీజేపీ శ్రేణులు. సంఘ్ పరివార్, విద్యార్ధి పరిషత్ నుంచి వచ్చిన వారికి పదవులు దక్కడం లేదు. జంప్ జిలానీలకు మాత్రం పదవులు కట్టబెడుతున్నారంటూ పలువురు కాషాయం శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనితీరును చూడకుండా కేవలం జోకుడు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నేతలకే పదవులు వస్తాయా అని కూడా పలువురు జిల్లా నేతలు ప్రశ్నిస్తున్నారు.

సీనియర్లకు కనీసం గౌరవం కూడా కానరావడం లేదు. కనీసం ఫోన్ చేసి సీనియర్లను ఆహ్వానించే సంస్కృతీ కూడా కనుమరుగయి పోయిందనే ఆరోపణలు పార్టీలో వ్యక్తం కావడం విశేషం. బూతు కమిటీలతో పాటు పార్టీ అనుబంద సంఘాల పదవులను కూడా భర్తీ చేయక పోవడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవలం జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందా అని పలువురు పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. కష్టపడినవారికి కాకుండా జోకుడు వ్యవస్థతో పదవులు వచ్చే పార్టీలో ఉండటం అవసరమా అనే అభి ప్రాయాలు కూడా పార్టీలో చర్చకు రావడం విశేషం. మరి కొందరు ఊగిసలాటలో ఉన్నారు. ఆర్థికంగా, సంఖ్యా బలం ఉన్న నేతలు కొందరు పక్క చూపులు కూడా చూస్తున్నారు. స్థానిక ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి కొనసాగితే మంచిర్యాల జిల్లాలో పార్టీ పరిస్థితి రాష్ట్ర పెద్దలు ఊహించిన దాని కంటే బిన్నంగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం కావడం విశేషం. 

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.