CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనారోగ్యవాతావరణంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి. సర్వే ఫలితాలు కూడా కూటమికే అనుకూలంగా తేలాయి. తెలంగాణ ముఖ్యమంత్రి తన మొక్కులు తీర్చుకోడానికి తిరుపతి వెళ్లారు. అనంతరం మీడియాతో కాసేపు మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఏపీ లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఇద్దరం కలిసి రెండు రాష్ట్రాల అభివృద్ధి, అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకుంటామని అన్నారు. స్నేహపూర్వక వాతావరణంలోనే ఇద్దరం కలిసి పరిపాలన పరంగా కొనసాగుతామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం నాయకులతో నేటికి మంచి సంబంధాలే ఉన్నాయి. రాష్ట్రము విడిపోయినప్పటికీ అక్కడి నాయకులతో స్నేహాన్ని కొనసాగించారనే పేరు ఉంది. ఉమ్మడి రాష్ట్రము లో తెలుగు దేశం అధినేత తో రేవంత్ రెడ్డి కి తత్సంబందాలు ఉన్నాయి. చంద్రబాబు తీసుకునే నిర్ణయాల్లో రేవంత్ రెడ్డి భాగస్వామి అయ్యేవారు. తెలంగాణ నిఘా అధికారులు కూడా ఏపీ లో చంద్రబాబు నాయుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి కి స్పష్టం చేయడంతోనే ఆయన తిరుపతిలో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడితే రేవంత్ రెడ్డి కి రాజకీయంగా బలమైన వాతావరణం ఏర్పడుతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకోడానికి అవకాశాలు ఉన్నాయి. నాగార్జున సాగర్, శ్రీ శైలం ప్రాజెక్ట్ నీటి వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జూన్ రెండు తో హైదరాబాద్ పై ఏపీ కి ఎలాంటి హక్కులు ఉండవు. రాష్ట్రము విడిపోయినప్పుడు ఏపీ కి తెలంగాణలో కొన్ని భవనాలు కేటాయించబడ్డాయి. వాటి గురించి చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ఏపీ కి కేటాయించిన భవనాలను కూడా తెలంగాణ కు అప్పగించాలి. ఇలాంటి సమస్యలను రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు సమావేశమై మాట్లాడుకునే వేదిక ఏర్పడితే రెండు రాష్ట్రాల సమస్యలు తొందరగా పరిస్కారం అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.