sankranti : సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజు వచ్చేది కనుమ పండుగ. ఆ పండుగ రోజు ఏమి చేస్తారో చాలా మందికి తెలియదు. కనుమ రోజు ఏమి చేయాలో కూడా తెలియదు. సంక్రాంతి పండుగ రోజు తోనే పండుగ ముగిసినట్టుగా చాలా మంది భావిస్తారు. కానీ కనుమ పండుగను రైతులు చాలా ఘనంగా జరుపుకుంటారు.
కనుమ పండుగ అంటే గోమాతలను పూజించే రోజు. ఆ రోజు రైతులు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడుగుతారు. వాటికీ బొట్టు పెట్టి, హారతి ఇస్తారు. వివిధ రకాల వస్తువులతో అలంకరిస్తారు. అదేవిదంగా నాగలికి కూడా బొట్టు పెట్టి హారతి ఇస్తారు. పశువుల పాకను శుభ్రం చేసి అక్కడ కొబ్బరికాయ కొడుతారు. నైవేద్యం వండి కొంత పశువులకు తినిపిస్తారు. కొంత కుటుంబ సభ్యులు తిని, మిగిలిన నైవేద్యాన్ని పొలం, చేనులో చల్లుతారు.
కనుమ రోజు రైతులు ఇంటి నుంచి బయటకు ఏ పని చేయడానికి కూడా వెళ్ళరు. ప్రయాణం కూడా చేయరు. కొత్తగా పెళ్లైన వధూవరులు గౌరీ మాతకు పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. ఇటువంటి కార్యక్రమాలతో కనుమ పండుగ ముగుస్తుంది.