Mrugashira Karthe + Fish : దసరా పండుగ వచ్చిందంటే మేక మాంసం తో వంటలు చేసుకుంటారు. మరికొందరు కోడి కూర తో భోజనాలు చేస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే రకరకాల పిండి వంటలు చేస్తారు. తీపి వంటలు చేస్తారు. వాటికీ తోడుగా మేక మాంసం, కోడి కూర తో వంటలు చేసుకొని ఆనందంగా గడుపుతారు. దీపావళి వచ్చిందంటే తీపి వంటలు, లక్ష్మి దేవి పూజలతో భక్తితో ఉంటారు కుటుంబ సభ్యులు. కానీ మృగశిర రోజు ఎలాంటి పూజలు చేయరు. వ్రతం చేయరు. మాంసం తినరు. కోడి కూర తినరు. కేవలం చేపల కూర మాత్రమే తింటారు. కుటుంబాల ఆర్థిక స్తోమత ప్రకారం చేపలు వండు కుంటారు. కొన్ని ప్రాంతాల్లో చేపలు దొరకని నేపథ్యంలో ముందు రోజే చేపలు ఉన్న ప్రాంతానికి వెళ్లి కొని వండుకుంటారు. తప్పనిసరిగా మృగశిర రోజు చాల వరకు ప్రజలు చేపలు వండుకొని భోజనం చేస్తారు. కారణం ఏమిటంటే …..
రోహిణి కార్తెలతో ఎండలు మండి పోతాయి. జనం తట్టుకోలేక తల్లడిల్లిపోతారు. మృగశిర కార్తెకు వాతావరణం చల్లబడుతుంది. అప్పటిదాకా ఉన్నవేసవి వాతావరణం కాస్త చల్లబడిపోతుంది. వాతావరణం మారి పోవడంతో మానవుని శరీరంలో కాస్త మార్పులు జరుగుతాయి. శరీరంలో జరిగే మార్పులకు కూడా కొంత సమయం పడుతుంది. చల్లబడిన వాతావరణం వలన కొందరికి గుండె, ఆస్తమా జబ్బులు ఉన్నవారు ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతారు. ఆ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గి పోతుంది. శ్వాశకోశ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జలుబు, జ్వరం వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకనే పూర్వం నుంచి ఆచారం వస్తోంది. మృగశిర రోజు చేపల కూర తినాలనే ఆచారం ఆనవాయితీగా వస్తోంది. చేపలు తినడం వలన శరీరంలో ఉష్ణోగ్రత సమపాళ్లలో ఉంటుంది. జీర్ణశక్తి కూడా తగ్గకుండా వేగవంతముగా కొనసాగుతుంది. చేపలు తింటే జబ్బులు వస్తాయనే అపోహ కూడా ప్రజల్లో ఉంది. కానీ అది నిజం కాదు. చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, కానీ హాని చేయవు అని వైద్య శాస్త్రం స్పష్టం చేస్తోంది.
చేపలను ఫ్రై , పులుసు పద్దతిలో తినవచ్చు. సాదా అన్నం, బిర్యానీ లో కూడా ఎదో ఒక పద్దతిలో తినవచ్చు. ఏ పద్దతిలో తిన్న చేపలతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.కానీ శరీరానికి నష్టం జరగదు. చేపలో ఇనుము ఎక్కువగా ఉన్నందున శరీరంలో రక్తం తొందరగా ఉత్పత్తి అవుతుంది. చేపలో ఉండే అయోడిన్ పదార్థంతో గాయిటర్ అనే జబ్బు రాకుండా నిరోధిస్తుంది. మెదడు సక్రమంగా పనిచేస్తుంది. పిల్లలు మానసికంగా ఎదుగుతారు. చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. చిన్న, చిన్న చేపల్లోని ముల్లును తింటే వాటివలన శరీరానికి ఇనుము, భాస్వరం, కాల్షియం లభిస్తాయి.